తెలుగుదేశం పార్టీ నిర్వహణ బాధ్యతను తన కుమారుడికి అప్పగించేసేయాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తన వయసు మీరిపోతున్నందున ఇప్పటి నుంచే లోకేష్ ను తయారు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన చంద్రబాబునాయుడు తిరిగి రాగానే బాధ్యతలను లోకేష్ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. లోకేష్ కు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలను అప్పగించే అకాశం ఉంది. లోకేష్ ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ తరపున గానీ, ప్రభుత్వంలో ఉన్నప్పుడు గానీ ఎలాంటి ప్రభావం చూపలేదు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎం ఎల్ ఏగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినా ఎక్కడా కూడా తనదైన ముద్ర వేయలేకపోయారు. అత్యంత కీలక మైన పంచాయితీ రాజ్ శాఖ లో ఆయన స్వతంత్రించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. ఆయన ఆ శాఖను అర్ధం చేసుకునే లోపునే ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం ఎం ఎల్ సిగా కొనసాగుతున్న లోకేష్ తప్ప తెలుగుదేశం పార్టీకి వేరే వారసుడు లేకపోవడంతో చంద్రబాబునాయుడు గత్యంతరం లేక ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాఖకు టిడిపి అధ్యక్షుడుగా కళా వెంకటరావు ఉన్నారు. ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీసుకుని లోకేష్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి మరింత మంది బిజెపిలో చేరే అవకాశం ఉన్నందున వలసలు పూర్తి అయిన తర్వాత పార్టీని గ్రామ స్థాయి నుంచి పునర్ నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ పని ని లోకేష్ కు అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఆయన పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా కూడా ఆయన సతీమణి భువనేశ్వరి అందుకు అంగీకరించడం లేదని అంటున్నారు. అందువల్ల లోకేష్ కు బాధ్యతలు అప్పగించే సమయం త్వరలోనే ఉందని అంటున్నారు.
previous post