టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో సత్తా చాటుతున్నారు. ఓ కీలక సదస్సుకు హాజరయ్యే నిమిత్తం మాత్రమే అమెరికాలో కాలుమోపిన లోకేశ్, ఐటీలో ప్రపంచంలోనే మేటి సంస్థల ప్రధాన కార్యాలయాలను సందర్శిస్తూ వాటి అధిపతులను కలుస్తూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తూ సాగుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగానే అమెరికాకు వెళ్లిన లోకేశ్ ఆ దిశగా అసలు ఎలాంటి అంచనాలను కూడా నిర్దేశించుకోలేదు.
అసలు ఆయా కంపెనీల అధిపతులతో భేటీ అవుతానన్న విషయంపై కూడా లోకేశ్ క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఆ దిశగా లోకేశ్ కు సంబంధిత కంపెనీల నుంచి అపాయింట్ మెంట్లే లేవు కూడా. అలాంటిది అమెరికాలో కాలుమోపినంతనే జూలు విదిల్చిన లోకేశ్ టాప్ కంపెనీల అధిపతులతో వరుస భేటీలు అవుతూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబందించిన అంశం తెలియగానే ఏపీ ప్రజలు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. అమెరికా పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను కలవనున్నట్లుగా అమెరికా బయటుదేరడానికి ముందే లోకేశ్ బృందం ప్రకటించింది.
అయితే నేరుగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతోనే లోకేశ్ భేటీ అవుతారన్న సమాచారం లేదు. అమెరికాలో తన విద్యాభ్యాసం, ఈ క్రమంలో తనకు అక్కడ ఉన్న సర్కిల్, అమెరికాలోని దాదాపుగా అన్ని సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న తెలుగు నిపుణులు మొత్తంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సాగుతున్న లోకేశ్ సత్య నాదెళ్ల అపాయింట్ మెంట్ కూడా సాధించారు. సత్య నాదెళ్లతో భేటీ సందర్భంగా ఏపీలో అభివృద్ధి చెందాల్సిన రంగాలు, ఆయా రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలు, అందులో మైక్రోసాఫ్ట్ కీలక భూమిక పోషించే రంగాలు…తదితరాలపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ తో కలిసి ఏపీ పనిచేయాలనుకుంటుందన్న విషయాన్ని కూడా లోకేశ్ ప్రస్తావించారు.
ఆ మాట విన్నంతనే సత్య నాదెళ్ల తప్పనిసరిగా ఆ దిశగా ఆలోచన చేద్దామంటూ లోకేశ్ కు హామీ ఇచ్చారు. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన సత్య నాదెళ్ల… ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుమారుడన్న విషయం తెలిసిందే. నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా… సదరు ఐఏఎస్ అదికారి కీలక స్థానాల్లో పనిచేశారు. ఉన్నత చదువులు చదివిన సత్య… అమెరికా వెళ్లి మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన సొంతూరు, సొంత రాష్ట్రంపై అందరికీ ఉన్నట్లుగానే సత్యకు కూడా ప్రత్యేకమైన అభిమానం ఉండి ఉంటుంది కదా. అందుకే కాబోలు… నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగే సత్య… లోకేశ్ బృందం అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వడంతో పాటుగా లోకేశ్ కు ఆయన రెడ్ కార్పెట్ స్వాగతం పలికారని చెప్పాలి. లోకేశ్ చెప్పిన వివరాలన్నీ విన్న తర్వాత తప్పక కలిసి పనిచేద్దామని కూడా ఆయన భరోసా ఇచ్చినట్లుగా సయాచారం. సత్య నాదెళ్లతో భేటీలో భాగంగా లోకేశ్ పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. ఏపీకి నాలుగోసారి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారని చెప్పిన లోకేశ్… కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఐటీలో మేటిగా రూపుదిద్దాలన్న కసితో పనిచేస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు కేంద్రంగా మార్చాలని కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
ఈ క్రమంలో అమరావతిలో ఏఐ వర్సిటీని ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నామని ఆయన తెలిపారు. ఏఐని వ్యవసాయానికి అనుసంధానించడం ద్వారా మరింత మేర అధిక దిగుబడులు సాదించే అవకాశాలున్నాయని, ఆ దిశగానూ సమాలోచనలు చేస్తున్నామని తెలిపారు. ఇక క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా కూడా కీలక అడుగులు వేయనున్నట్లు తెలిపారు. అందుకు అనువైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ రెండు రంగాలకు ఏపీని గమ్యస్థానంగా మార్చాలనుకుంటున్నామని తెలిపారు.
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన మానవ వనరులను సద్వినియోగం చేసుకునే దిశగానే బహుళ జాతి సంస్థలను ఏపీకి ఆహ్వానిస్తున్నామని లోకేశ్ తెలిపారు లోకేశ్ చెప్పినదంతా విన్న సత్య…ఏపీతో కలిసి పనిచేసే దిశగా ఆలోచన చేద్దామంటూ హామీ ఇచ్చినట్లుగా సమాచారం.