రైల్వే బడ్జెట్ లో ఎపికి అత్యధికంగా కేటాయింపులు చేసినందుకు విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ లోని రైల్ భవన్ లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలు, నూతనంగా తీసుకొచ్చిన పాలసీల గురించి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లోకేష్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ కు ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనుమతులు త్వరిత గతిన ఇవ్వడం మాత్రమే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రాజెక్టులు త్వరితగతిన ఏర్పాటు అయ్యే విధంగా అనేక చర్యలు తీసుకుంటున్నాం అని వివరించారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో రాబోతున్న అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని, దానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని లోకేష్ కోరారు.
విశాఖపట్నం లో ఏర్పాటు చేయాలనుకుంటున్న డేటా సిటి ఏర్పాటు కు సహకరించాలని కూడా కోరారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో డేటా సిటీల ఏర్పాటు కు పెద్ద ఎత్తున డిమాండ్ రాబోతుంది. ఏఐ తో వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ డేటా సిటీల ఏర్పాటు అవసరమైన ప్రత్యేక పాలసీలు, సింగిల్ విండో పద్ధతిలో కేంద్రం నుండి ఇవ్వాల్సిన అనుమతులు సులభతరం చెయ్యాలని కోరారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటు కు సహకారం అందించాలని కోరారు.
డేటా సిటి లు, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటు తో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ యువత కు ఉద్యోగ అవకాశాలు వస్తాయని దానికి మీ పూర్తి సహకారం కావాలని లోకేష్ కోరారు. 2047 కి 30 ట్రిలియన్ డాలర్ కు దేశ ఆర్థిక వ్యవస్థ చేరాలి అనేది ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం. కేంద్ర సహకారంతో ఏఐ విప్లవంతో రాబోతున్న అవకాశాలు అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ లక్ష్యంతో భాగస్వామ్యం అవుతుంది అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో అన్నారు. ఐదేళ్ల లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని లోకేష్ వివరించారు.
మంగళగిరి లో ఎన్నో ఏళ్లుగా 800 నిరుపేద కుటుంబాలు నిరుపయోగంగా ఉన్న రైల్వే భూముల్లో నివసిస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని తద్వారా ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. లోకేష్ అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.