ఇన్ని రోజులూ ఉత్తరాది పార్టీగా పేరు పొందిన భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కాలు మోపడమే కాదు నాట్యం చేసేందుకు వీలైన స్థలం వచ్చేసింది. ఉన్న పార్టీలు కూలిపోవడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం లాంటి అంశాలతో బాటు సామాజిక సమీకరణాలు పూర్తిగా మారిపోవడం బిజెపికి కలిసి వస్తున్నది. చీలికలు పేలికలు అవుతున్న పార్టీలను నాయకులను చూసి విసుగెత్తిన దక్షిణాది రాష్ట్రాల ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారనడానికి సర్వ ఆధారాలు లభ్యం అవుతున్నాయి. ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికలలో ఉత్తరాది ప్రజలు మోడీకి బ్రహ్మరథం పట్టగా దక్షిణాది ప్రజలు బిజెపి వైపు కన్నెత్తి అయినా చూడలేదు. ముగిసిన లోక్ సభ ఎన్నికల ఫలితాలను చూసి మోడీ హవా దక్షిణాది కి పాకడానికి చాలా సంవత్సరాలు పడుతుందని బిజెపి సిద్దాంత కర్తలు లెక్క వేసుకున్నారు. అయితే వారి అంచనాలను తప్పు చేస్తూ మూడు నెలల్లోనే దక్షిణాదిన ఇంత మార్పు వచ్చేసింది. కర్నాటక రాష్ట్రంలో బిజెపి అధికారం కైవసం చేసుకోవడంతో ఈ వాతావరణం మరింతగా బలపడింది. తెలంగాణ విషయానికి వస్తే బిజెపి మంచి దూకుడు మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో చతికిల పడటంతో బాటు ఆ పార్టీకి చెందిన ఎంఎల్ఏలు మూకుమ్మడిగా టిఆర్ఎస్ లోకి వెళ్లిపోవడం తదితర పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణలో బతికే అవకాశం కనిపించడం లేదు. ఈ కారణంగా టిఆర్ఎస్ వ్యతిరేక వర్గాలన్నీ బిజెపి వైపు ర్యాలీ అవుతున్నాయి. ఇక వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి టిఆర్ఎస్ పార్టీని సవాల్ చేసేది బిజెపినే అని తేలిపోయింది. వస్తే అధికారం లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి తెలంగాణలో ఆవిష్కృతం కావడానికి బేస్ వచ్చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల నాటికి కనుమరుగు కాబోతున్నట్లు వాతావరణ కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పేరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాడో మర్చిపోయారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సవాల్ చేసే శక్తులన్నీ బిజెపి పంచన చేరుతున్నాయి. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బిజెపి ఇచ్చినన్ని సీట్లు తీసుకుని పోటీ చేస్తే బతికి బట్టకడుతుంది తప్ప ఒంటరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనలేదు. జనసేన లాంటి పార్టీలు ప్రధాన పోటీలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి వచ్చేఎన్నికల నాటికి బిజెపి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అనివార్యంగా కనిపిస్తున్నది. మూడు నెలలుగా సరైన పాలన అందించలేని ఇదే పరిస్థితి కొనసాగితే బిజెపి లీడ్ తీసుకుని అధికారంలోకి వచ్చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన ప్రణాళికతో వెళితే బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించేందుకు వీలుంటుంది. తమిళనాడులో లీడర్ లేని ఏఐఏడిఎంకే కు మోడీనే పెద్ద దిక్కు. రజనీకాంత్ కూడా బిజెపితో చేతులు కలుపుతున్నందున రజనీకాంత్, ఏఐఏడిఎంకెలను కలిపి పెద్దన్నలా బిజెపి ఉంటుంది. ఈ మూడు పార్టీల కాబినేషన్ లో తమిళనాడు బిజెపి వశంకావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేరళలో కూడా బిజెపి ఖాతా తెరిచేందుకు అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పుడే చెప్పడం కష్టం. అందువల్ల మోడీ అమిత్ షాలకు వెల్ కం చెప్పడం తప్ప ఎవరూ ఏం చేయలేరు.
previous post
next post