24.7 C
Hyderabad
July 18, 2024 08: 22 AM
Slider సంపాదకీయం

ఎంతో వేగంగా కదిలిన నరేంద్రమోడీ

Narendra-Modi-and-Amit-Shah

జమ్మూ కాశ్మీర్ విషయంలో వేగంగా పావులు కదిపి ఉండకపోతే భారత్ మరిన్ని కష్టాల్లో పడి ఉండేది. అనూహ్యంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ తో సయోధ్య కు రావడం ఇటీవల జరిగిన అతి పెద్ద పరిణామం. అమెరికాతో చర్చలకు వెళ్లిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను రిసీవ్ చేసుకోవడానికి ఉన్నత స్థాయి వ్యక్తులు ఎవరూ రాకుండా తీవ్ర పరాభవం చేశారు అంటూ వార్తలు వచ్చిన నాటి నుంచే కుట్ర ప్రారంభం అయింది. ఇలాంటి వార్తలతో అంతర్జాతీయ మీడియా చూపులను మరల్చిన అమెరికా, ఆ సమయంలోనే పాకిస్తాన్ తో అతి కీలక ఒప్పందాలు చేసుకున్నది. త్వర త్వరగా జరిగిపోయిన ఆ నిర్ణయాలు రాబోయే రోజుల్లో భారత్ కు సవాల్ విసిరేవే కావడం గమనార్హం. జార్జి డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఉగ్రవాదంపై పోరాటం పేరుతో పాకిస్తాన్ కు నిధులు గుమ్మరించారు. ఆ నిధులను పౌర సదుపాయాలకు వాడాల్సి ఉండగా పాకిస్తాన్ వాటిని మిలిటరీ అవసరాలకు వినియోగించుకున్నది. నిధులే కాకుండా ఎఫ్ -16 ఫైటర్ జెట్ లను మరిన్ని ఆయుధాలను కూడా అమెరికా పాకిస్తాన్ కు సమకూర్చింది. అయితే ఆ తర్వాతి కాలంలో బరాక్ ఓబామా పాక్షికంగా మొదలు పెట్టి 2016 నాటికి పాకిస్తాన్ కు ఇచ్చే సైనిక, ఆర్ధిక సాయం పూర్తిగా నిలిపివేశారు. ఉగ్రవాదులను అణిచే వరకూ ఆర్ధిక సహాయం పునరుద్ధరించే ప్రసక్తే లేదని అమెరికా సెనేట్ కూడా తేల్చి చెప్పింది. ఆ తర్వాత చైనా కొద్ది మేరకు పాకిస్తాన్ ను ఆదుకుంది కానీ అమెరికా తో ఉన్నంత సౌలభ్యం పాకిస్తాన్ కు చైనా విషయంలో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జోలె పట్టుకుని అమెరికా వెళ్లే సరికి అక్కడ ట్రంప్ పాకిస్తాన్ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా వేచి ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపన కోసం తాలిబాన్ లను మట్టుపెట్టేందుకు దిగిన అమెరికా అది సాధ్యం కాని పరిస్థితుల్లో గౌరవ ప్రదంగా వైదొలగాలని భావిస్తున్నది. ఫలితం రాని యుద్ధం చేయడం వల్ల ప్రయోజనం లేదని అమెరికాకు అర్ధం అయింది. అయితే అకస్మాత్తుగా ఆ విధంగా చేస్తే అంతర్జాతీయంగా అమెరికా పరువు పోతుంది కాబట్టి పాకిస్తాన్ అవసరం ఇప్పుడు ఏర్పడింది. తాలిబాన్ లతో మాటా మాటా కలిపేందుకు పాకిస్తాన్ అమెరికాకు ఎంతో అవసరం. ఆ పని గత కొద్ది రోజులుగా జరుగుతున్నది. ఇప్పుడు క్లయిమాక్స్ కు వచ్చింది. తాలిబాన్ లు అమెరికాతో శాంతి చర్చలకు వచ్చారు. ఇదంతా పాకిస్తాన్ చేయాల్సిన క్రతువే. అందువల్ల అమెరికా కబురు పంపి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పిలిపించుకుంది. తాలిబాన్ నాయకులతో రాయబారం చేయడానికి ముందు తమ దేశ అవసరాలు తీర్చాలని ఆర్ధిక సాయం పునరుద్ధరించాలని ఇమ్రాన్ అమెరికాను కోరారు. జార్జి డబ్ల్యూ బుష్ సమయంలో పాకిస్తాన్ కు సరఫరా అయిన ఎఫ్ -16 లకు స్పేర్ పార్టుల కొరత తీవ్రంగా ఉంది. ఈ లోటు తీర్చడానికి అమెరికా ముందుకు వచ్చింది. 125 మిలియన్ డాలర్ల సాయం చేసేందుకు పాకిస్తాన్ కు హామీ ఇచ్చింది. అదే విధంగా ఆగిపోయిన ఆర్ధిక సాయాన్ని కూడా పునరుద్ధరించేందుకు అమెరికా ఒప్పుకున్నది. అధికారికంగా ఇది తెలియలేదు కానీ 125 మిలియన్ డాలర్ల సాయం మాత్రం అంతర్జాతీయ మీడియాలో వెల్లడైంది. ఇటీవల పాకిస్తాన్ భారత్ పై ప్రయోగించిన ఎఫ్ -16 లే కాదు మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ కూడా అమెరికా నుంచి తెచ్చుకున్నవే. ఈ అన్ని యుద్ధ పరికరాలకు సాంకేతిక సాయం అందించేందుకు 60 మంది నిపుణులను కూడా అమెరికా పాకిస్తాన్ కు పంపేందుకు అంగీకరించింది. పాకిస్తాన్ ఈ యుద్ధ సామాగ్రిని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు తరలించి అక్కడ ఇప్పుడు అమెరికా చేస్తున్న పని చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు అతి పెద్ద దిక్కుగా ఉన్న భారత్ కు చిక్కులు తప్పవు. అంతే కాదు అందులో సగం యుద్ధ పరికరాలను పాకిస్తాన్ కాశ్మీర్ వైపు మళ్లించే అకాశం స్పష్టంగా ఉంది. భారత్ వైపు ఎఫ్ -16 లను పాకిస్తాన్ వాడదు అని గతంలో జార్జి డబ్ల్యూ బుష్ హామీ ఇచ్చారు కానీ ఆ తర్వత దాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించినా అమెరికా కిక్కురుమనలేదు. ఇప్పుడే అదే జరుగుతుందనడంలో సందేహం లేదు. అందుకే భారత్ వేగంగా స్పందించి జమ్మూ కాశ్మీర్ ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వం పై పోరాడుతున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అతర్జాతీయ ఉగ్రవాద గ్రూపుగా ఇటీవలె అమెరికా గుర్తించింది. ఇలాంటి చర్యలన్నీ పాకిస్తాన్ ను ప్రసన్నం చేసుకోవడానికి డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేస్తున్న పనులే. ఈ సారి గతంలో మాదిరిగా చుక్కలు లెక్క పెడతూ కూర్చుంటే మనం వెనుకబడిపోవాల్సి వస్తుంది. పాకిస్తాన్ ఇప్పుడు అత్యంత బలహీనంగా ఉన్నది. అమెరికా నుంచి సాయం అందే లోపు కాశ్మీర్ అంశానికి ముగింపు పలకాలి. అందుకే ఆగ మేఘాలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆర్టికల్ 370 ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ ను రెండు ముక్కలు చేసి తన ఆధీనంలో ఉంచుకున్నది. పాకిస్తాన్ బలంగా ఉన్నప్పుడు ఈ చర్యకు పాల్పడితే 1947 నాటి తిరుగుబాటు సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందని కూడా ప్రధాని నరేంద్రమోడీ భావించి ఉండవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ బలం లేని దేశం కాబట్టి కాశ్మీర్ పై చర్యకు ఇదే తగిన సమయం అని ఆయన భావించి ఉండవచ్చు. అమెరికా పాకిస్తాన్ లకు భారత్ లో ఎలాంటి రాజకీయాలు ఉంటాయో తెలుసు కాబట్టి ఇలాంటిదేం జరగదని వారు స్థిరమైన నమ్మకం తో ఉన్నారు. అయితే జరిగిపోయింది…. ఇది కాశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయం కాదు. కేవలం దేశ భద్రత కోసం తీసుకున్న నిర్ణయం.

Related posts

రైతు బజార్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ…!

Satyam NEWS

డిసెంబర్ 9న బిసి ధర్నాను జయప్రదం చేయాలి

Sub Editor

ఆహార వితరణ చేసిన మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్టు

Satyam NEWS

Leave a Comment