ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అలా చేయకుండా న్యాయవ్యవస్థ చెప్పినా వినకుండా మొండిగా వ్యవహరిస్తే కేసీఆర్ సర్కార్ పై చర్యలు తప్పవని జాతీయ బిసి కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె విషయం కేంద్రం, బీసీ కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. కార్మికులు తమకు ఫిర్యాదు చేశారని, జాతీయ బిసి కమిషన్ దానిపై విచారణ చేపడుతుందన్నారు. వెనుకబడిన ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేలాగా కమిషన్ అలోచిస్తుందన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని, తక్షణమే జీతాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ జరప లేదు, ఇవ్వలేదన్నారు. రాజ్యాంగాన్ని ఆయన కావాలనే ఉల్లంఘించారని ఆయన అన్నారు. రాజ్యాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని చెప్పారు. ఆర్టీసీ కార్మికులలో ఎక్కువ మొత్తంలో బీసీలే ఉన్నారన్నారు. సురేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. కార్మికులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదని తల్లోజు ఆచారి అన్నారు. శాంతియుతంగా సమ్మె చేసుకోవాలని సూచించారు. 29న ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చిస్తామని ఆయన తెలిపారు. కొల్లాపూర్ పట్టణంలో ఆర్టీసీ కార్మికుల 17వరోజు సమ్మెలో భాగంగా ఆర్అండ్ బి అతిథి గృహం ముందు మానవహారం నిర్వహించిన అనంతరం ర్యాలీగా వెళ్లి కెఎలై అతిధి గృహంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారిని కలిశారు. ఆర్టీసీ కార్మికులు రెండు చేతులు జోడించి తమ ఆవేదనను చెప్పుకున్నారు. స్పందించిన ఆచారి వారితో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేయవలసిన అవసరం ఉందన్నారు.
previous post