గత నెల ఇరవై మూడవ తేదీ నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి బారిన దేశ ప్రజలు పడకూడదనే ఉద్దేశంతో లాక్ డౌన్ విధించడంతో అన్ని వర్గాల ప్రజలు పరిస్థితి ఓ విధంగా ఉంటే నాయీ బ్రాహ్మణ సోదరుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
మనిషి పుట్టుక నుంచి చావు వరకు నాయీ బ్రాహ్మణులకు విడదీయలేని బంధం ఉంది. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి వద్ద వచ్చి తమ కుల వృత్తిని దైవంగా భావించి జీవనం కొనసాగిస్తున్నారు వీరు. ఈ కరోనా పుణ్యమని తాము తీవ్రంగా నష్టపోయామని నాయీ బ్రాహ్మణులు తమ దీనావస్థను సత్యం న్యూస్ తో పంచుకున్నారు.
ఈ లాక్డౌన్ వల్ల తాము తీవ్ర ఆర్థిక అవస్థలు ఎదుర్కొంటున్నామని నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మంగళి నారాయణ అన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి మంగళి నర్సింలు మాట్లాడుతూ తమ దుకాణాలు మూసి ఉంచి నెల రోజులు గడుస్తున్నదని, కత్తెర ఆడితేనే గాని కడుపు నిండని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు.
ఇటువంటి సమయంలో లాక్ డౌన్ తమ కొంప ముంచిందన్నారు. సోషల్ మీడియాలో మంగలి షాపుకు వెళితే కరోనా వైరస్ వ్యాపిస్తుందని పుకార్లు చేయడంతో తమ వద్ద ఎవ్వరూ కటింగ్ లకు షేవింగ్ లకు రావడం లేదన్నారు.ఇంటింటికి వెళ్లి చేద్దామన్నా కూడా వారు వద్దని తిరిగి పంపిస్తున్నారని దీంతో తాము తీవ్ర మనోవేదన గురవుతున్నామన్నారు.
గతంలో బిసి కార్పొరేషన్ ద్వారా ప్రతి మంగలి దుకాణానికి రుణాలు ఇప్పిస్తామ౦టే ఎంతో ఆశగా ఎదురు చూశామని కానీ అది నేటి వరకు ఎటువంటి ఫలితం ఇవ్వలేదన్నారు. ఇక ఈ కరోనా మహమ్మారి ఎక్కడ నుండి వచ్చిందో కానీ తమ పొట్టకొట్టిందని తన దీనావస్థను సత్యం న్యూస్ తో పంచుకున్నారు.
తాము బిచ్కుంద మండల చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి కుల వృత్తిని ఎంచుకుని రూములు అద్దెకు తీసుకుని తమ వృత్తిని కొనసాగిస్తున్నామని ఇప్పుడు రూములు కిరాయి కట్టే పరిస్థితి కూడా లేదని అన్నారు. ఆదాయం లేక బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నామని వారన్నారు.
పెద్ద షాపులో పనిచేసే నౌకర్లు కూడా జీతాలు లేక అల్లాడుతున్నారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం నాయీ బ్రాహ్మణ సమస్యల పై ప్రత్యేక దృష్టి సారించి తమను ఆదుకోవాలని అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించి తమకు తమ కుటుంబ సభ్యులకు ఆదుకుని ఉంటే తాము ఎల్లవేళల ముఖ్యమంత్రి కెసిఆర్ కు రుణపడి ఉంటామన్నారు.
అధ్యక్ష కార్యదర్శులతో పాటు నాయిబ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు విజయ్ కుమార్ సార్ సంఘ సభ్యులు లక్ష్మణ్ దేవాడ విట్టల్ మారుతి అశోక్ బాల్రాజ్ గంగాధర్ విట్టల్ తదితరులు కూడా తమ ఆవేదన పంచుకున్నారు.