27.7 C
Hyderabad
April 20, 2024 01: 44 AM
Slider జాతీయం

మర ఫిరంగులను ఎదిరించిన ఆజాద్ హింద్ ఫౌజ్

netajee 3

నేతాజీ సుభాష్ చంద్రబోస్ సారధ్యం వహించి ఉంటే మన దేశానికి ఏనాడో స్వాతంత్ర్యం వచ్చేది అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని అమలు చేసే నేతాజీ సుభాష్ తన కు నచ్చని విషయాలపై అతి వేగంగా స్పందిస్తారు. దేశానికి మేలు చేయడం అనే అంశం తప్ప సుభాష్ చంద్రబోస్ దేనికీ ప్రాధాన్యతనివ్వరు.

ఎవరినైనా సరే నిర్మొహమాటంగా నిలదీయటం ఆయన నైజం. ఆయనను ఎందరు వ్యతిరేకించినా నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం, ఎవరికీ అడుగులకు మడుగులు వత్తని స్వంతంత్ర వ్యక్తిత్వం నేతాజీది. జాతీయ స్థాయి నాయకులు కూడా సుభాష్ చంద్రబోస్ పట్ల ఈర్ష్యను పెంచుకోవడానికి ఇవే కారణాలు. అయినా ఎవరికీ ఆయన ఎన్నడూ భయపడలేదు, గులాంగిరి చేయలేదు. సింహం లాగా బ్రతికి యుద్ధరంగంలో సింహం లాగానే మరణించాడు.

ఒకసారి సుభాస్ చంద్ర బోస్ హిట్లర్ ను కలవడానికి వెళ్ళాడు. 10 నిముషాల తరువాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని ఆయనను అడిగాడు. వెంటనే సుభాస్ చంద్ర బోస్ సమాధానం చెబుతూ మీ బాస్ ను రమ్మని చెప్పు అన్నాడు. ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చి బోస్ భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఇద్దరు కలసి విషయాలు చర్చించుకున్న తరువాత వెళ్ళబోయే ముందు హిట్లర్, బోస్ ని అడిగాడు.

ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని. బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్ కి తప్ప ఇంక ఎవరికీ లేదు అని బోస్ జవాబిచ్చాడు. అదీ ఆయన ధైర్యం, సాహసం, ఎవరికి తలవంచని నైజానికి గుర్తు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు అవి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు ఒక వైపు మోహరించాయి. రెండో వైపు జర్మనీ, ఇటలీ, జపాన్ లాంటి దేశాలు ఉన్నాయి.

మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటన్ ఉన్న వైపు మనం ఉండాలా? లేదా బ్రిటన్ ను దెబ్బతీసేందుకు శత్రువుతో చేతులు కలపాలా అనేది మీమాంస. కాంగ్రెస్ పార్టీ లో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. బ్రిటన్ కు సాయం చేయడమే కరెక్టని మెజారిటీ అనుకున్నారు. అయితే బ్రిటన్ కు సహాయ నిరాకరణ చేయడం ద్వారా ఇబ్బంది పెట్టి స్వాతంత్ర్యం తెచ్చుకోవడం కరెక్టని సుభాష్ చంద్రబోస్ భావిచారు.

మన శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనే సిద్ధాంతం సుభాష్ చంద్రబోస్ ది. అదే ప్రకారం ఆయన జర్మనీ వైపు మొగ్గు చూపారు. ఇలా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుండి రష్యా, అక్కడి నుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకొన్న బోస్ జర్మన్ దేశస్తుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు. బెర్లిన్‌లో స్వతంత్ర గ్రీన్ గ్లోరీ స్కూల్ ను సుభాష్ చంద్రబోస్ స్థాపించాడు.

బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి, అగ్రరాజ్యాలకు బందీలైన 4500 భారతీయ సైనికుల క్యాంపు ఉత్తర ఆఫ్రికాలో ఉండేది. బోస్ అక్కడికి వెళ్లి వారితో ఇండియన్ లెజియన్ ప్రారంభించాడు. ఈ సైన్యం హిట్లర్‌కు, బో‍స్‌కు విశ్వాసాన్ని ప్రకటించింది. “భగవంతుని సాక్షిగా నేను జర్మన్ జాతి, రాజ్యం ఏకైక నాయకుడైన ఎడాల్ఫ్ హిట్లర్ కు, భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడే జర్మనీ సైనిక నాయకుడు సుభాష్ చంద్రబోస్‌కు విధేయుడనై ఉంటాను అంటూ ఇండియన్ లెజియన్ ప్రతిజ్ఞ చేసేది.

ఇండియన్ లెజియన్ సైన్యం జర్మనీ సైన్యం అధీనంలో ఉండేది. అయితే భారత స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో పోరాటం జరిపేది. ఇండియన్ లెజియన్ నాజీ జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారత దేశంపై దండెత్తి బ్రిటిష్ వారిని పారద్రోలుతుందని బోస్ కల. అనుకున్నట్లుగానే  ప్రపంచ యుద్ధం తీవ్రమై ఆంగ్లేయులు వరుసగా ఓటమి పాలు అవుతూ ఒక్కొక్క దేశాన్ని వదిలి పెట్టడం మొదలు పెట్టారు.

జపాన్ వరుస విజయాలను నమోదు చేస్తున్నది. జపాన్ లోని ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు రాస్ బిహారీ బోస్ మొదలైన వారు ఆహ్వానిస్తే 45 రోజులు ఒక జలాంతర్గామిలో ప్రయాణించి జపాన్ చేరుకొని అక్కడ తన పేరు ‘మత్సుడ’ అని మార్చుకున్నాడు బోస్. టోక్యో, సింగపూర్, రంగూన్ లలో స్ఫూర్తి దాయకమైన ఆయన ఉపన్యాసాలకు ఆజాద్ హింద్ ఫౌజ్ లో తండోపతండాలుగా సైనికులు చేరారు. మహిళల కోసం ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది.

రంగూన్ లో ఝాన్సీ లక్ష్మీ బాయి రెజిమెంట్ ను ఏర్పాటు చేసి మహిళలకు యుద్ధ శిక్షణ నివ్వడం మొదలు పెట్టారు. ఛలో ఢిల్లీ నినాదం తో ప్రత్యక్ష యుద్ధానికి ప్రణాళిక రచించి జపాన్ సహకారం ఖాయం అయిన తర్వాత ఇంఫాల్, అండమాన్, నికోబార్ లను జయించి అక్కడ స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసి ముందుకు సాగుతుండగా అంతవరకూ సహకరించిన విధి వక్రీకరించింది. కష్టాలు చుట్టూ ముట్టడం మొదలు పెట్టాయి.

ముస్సోలినీ, హిట్లర్ ల చరిత్ర సమాప్తం అయింది. జపాన్ దేశం యుద్ధంలో ఓటమి చవిచూడడం మొదలు పెట్టింది. బర్మాలో తీవ్రమైన వరదల మూలంగా సైనికులు అనారోగ్యం, మృత్యువులకు గురి అయ్యారు. ముందుకు, వెనక్కూ పోలేని పరిస్థితి వచ్చింది. జపాన్ సైన్యాధికారుల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగి సమన్వయ లోపం వచ్చింది.

రష్యా జపాన్ మీద దాడి చేసింది. జపాన్ మీద అణు బాంబ్ పడ్డది. జపాన్ అతలాకుతలమై లొంగిపోయింది. సుభాష్ చంద్ర బోస్ నిస్సహాయుడైనాడు. ఆ తర్వాతి కాలంలో జరిగిన పరిణామాలు సుభాష్ చంద్రబోస్ ఆకాంక్ష ను నెరవేర్చలేదు. భారతదేశం అవసరాలను హిట్లర్ అంతగా పట్టించుకోలేదు.

సహచరుల బలవంతం మేరకు సుభాష్ చంద్ర బోస్ సురక్షిత స్థలానికి వెళ్ళడం కోసం మంచురియా వెళ్ళడానికి అయిష్టంగానే బయలు దేరాడు. జపాన్ లో విమానం ఎక్కి తైపే దాక ప్రయాణించిన తర్వాత విమానం లో సాంకేతిక ఇబ్బంది ఏదో వచ్చికూలి పోయింది. ఆ విమానంతో పాటే 35 కోట్ల భారతీయుల ఆశలూ నేల కూలాయి.

స్వాతంత్ర్యం బిచ్చమడిగి తీసుకునే దానం కాదు పోరాడి గెలుచుకునే హక్కు అని నినదించి ఛలో ఢిల్లీ అని గర్జించి..” నేను మీకు కేవలం ఆకలి, దాహం, కష్టం, మృత్యువును మాత్రమే ఇవ్వగలను..నాకు మీ రక్తాన్ని ఇవ్వండి..మీకు స్వతంత్రాన్ని ఇస్తాను..” అని విశ్వాసం చిగురింపచేసిన స్వతంత్ర పోరాట ధ్రువ తార నేల కూలింది.

మెడ నుండి నడుము దాక తీవ్రంగా కాలిపోయి, సమీపం లోని హాస్పిటల్ లో వైద్య ప్రయత్నం జరిగినా తీవ్రంగా మంటలలో కాలిపోయిన ఆయన 1945 ఆగస్టు 18న రాత్రి 8 .30 గంటలకు కన్ను మూశారు. భారత మాత దాశ్యసృంఖలాలు తెగిపోయిన మహదానందకరమైన మధుర క్షణాలను అనుభవించకుండానే ఆయన మనల్ని వీడిపోయారు.

Related posts

బీజేపీ కార్యకర్తలు చురుకుగా పని చేయాలి

Satyam NEWS

జగిత్యాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Satyam NEWS

పరేడ్ గ్రౌండ్ లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment