నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంది. రానున్న మూడేళ్లలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి సర్కారు అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిధుల కొరత అన్న సమస్యను రానివ్వకుండా సీఎం నారా చంద్రబాబునాయుడు జాగ్రత్త పడుతున్నారు.
అదే సమయంలో రాజధానిగా దేశంలోనే కొత్త నగరంగా రూపుదిద్దుకోనున్న అమరావతిని… ఇతర రాజధాని నగరాల కంటే కూడా భిన్నంగానే కాకుండా ఒకింత ప్రత్యేకత కలిగిన రాజధాని నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సాగుతున్నారు. ఈ క్రమంలో గత టెర్మ్ లోనే పలు దేశాల్లో పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం ఆయా నగరాల్లోని నూతన నిర్మాణ శైలి, వాటిని అమరావతిలోనూ నిర్మిస్తే ఎలా ఉంటుందన్న దానిప ఇప్పటికే సమగ్ర అధ్యయనం జరిగిన సంగతి తెలిసిందే.
రాజధాని నగరంలో పాలనా పరమైన నిర్మాణాలు కాకుండా… 9 రంగాలకు సంబంధించి 9 వేర్వేరు సిటీలను నిర్మించాలని కూడా గతంలోనే నిర్ణయించారు. ఇప్పుడు కూడా ఆ 9నగరాలను అమరావతిలో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సర్కారు తీర్మానించింది కూడా.
అమరావతి.. ఈ పేరు విన్నంతనే ఓ కొత్త ఫీల్ కలిగేలా చంద్రబాబు సర్కారు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటోంది. నిర్మాణ శైలితో పాటుగా… నిర్మాణంలో వినియోగించే టెక్నాలజీలోనూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం… అమరావతికి సరికొత్త ఇమేజీని క్రియేట్ చేసే దిశగా సాగతోంది.
అమరావతి పేరు విన్నంతనే… ఓ బ్రాండ్ న్యూ సిటీ జనం కళ్ల ముందు మెదలాడాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణాన్ని సరికొత్త పద్ధతులతో ఆయన పరుగులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు సర్కారు చేపడుతున్న ఈ చర్యలతో అమరావతికి సరికొత్త శోభ అయితే రావడం ఖాయం.
రాజధాని నగరాల్లో అమరావతికి ఓ ప్రత్యేక గుర్తింపు కూడా దక్కడం ఖాయమేనని చెప్పక తప్పదు. ఈ దిశగా చంద్రబాబు సర్కారు చేపడుతున్న చర్యలకు తాజాగా ఓ సరికొత్త ఆయుధం కూడా తోడైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) రూపంలో వచ్చిన ఈ నూతన ఆయుధం… అమరావతిని ఓ అంశంలోనే దేశంలోనే తొలి నగరంగా నిలపనుంది.
అమరావతి వ్యాప్తంగా పూర్తిగా పైప్ లైన్ తో గ్యాస్ సరఫరా చేస్తామని ఆ సంస్థ ప్రతిపాదించింది. ఇలా చేయడం ద్వారా పూర్తిగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అవుతున్న తొలి రాజధాని నగరంగా అమరావతి రికార్డులకెక్కనుంది. వాస్తవానికి పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా కొత్తేమీ కాదు. అమరావతిని ఆనుకుని ఉన్న విజయవాడ, గుంటూరులతో పాటు దేశంలోని చాలా నగరాల్లో పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోంది. అయితే ఆయా నగరాల్లో పూర్తిగా పైప్ లైన్ ద్వారానే గ్యాస్ సరఫరా కావడం లేదు.
ఏదో నూతన నిర్మాణాలు, పైప్ లైన్ వేసేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఈ పద్దతిన గ్యాస్ సరఫరా అవుతోంది. గుజరాత్ లోని గాంధీ నగర్ జిల్లాలో నూతనంగా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్)లో పూర్తిగా పైప్ లైన్ ద్వారానే గ్యాస్ సరఫరా అవుతోంది.
సేమ్ టు సేమ్ గిఫ్ట్ సిటీ మాదిరే అమరావతి కూడా నూతనంగా నిర్మితమవుతున్న రాజధాని నగరం కదా. ఈ కారణంగా ఈ నగరంలోని అన్ని ఆవాసాలకు పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయడం చాలా సులువు.అంతేకాకుండా ఈ గ్యాప్ పైప్ లైన్ లతో పాటుగా విద్యుత్, టెలికాం వైర్లన్నీ అండర్ గ్రౌండ్ లోనే ఏర్పాటు చేయవచ్చు.
వెరసి అసలు ఒక్కటంటే ఒక్క తీగ కూడా బయట కనిపించకుండా…సరికొత్త శోభతో అమరావతి కళకళలాడుతుందన్న మాట. ఫలితంగా వంద శాతం వంట గ్యాస్ ను పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే రాజధాని నగరంగా అమరావతి నిలవనుంది. ఐఓసీఎల్ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అక్కడికక్కడే ఆమోదం తెలిపారు.