కామారెడ్డి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం నేడు కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి నేడు అధికారికంగా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రముఖ వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ వేద మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఛైర్మన్ పీఠంపై కూర్చుని ఫైలుపై సంతకం చేశారు. నూతన చైర్ పర్సన్ కు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శుభాకాంక్షలు తెలిపారు.
బొకే అందించి శాలువతో సత్కరించారు. కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేసి పాలనలో మంచి పేరు సంపాదించుకోవాలని ఆశీర్వదించారు. అనంతరం తండ్రి నిట్టు వేణుగోపాల్ రావు, తాత నిట్టు విఠల్ రావులు నిట్టు జాహ్నవిని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మున్సిపల్ ఇంఛార్జి కమిషనర్ శైలజ, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి మాట్లాడుతూ తనకు ఇంతటి అవకాశాన్ని కలిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని, ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధికి పాటు పడతానని చెప్పారు. రాష్ట్రంలో కామారెడ్డి మున్సిపాలిటీ ఆదర్శంగా ఉండేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.