27.7 C
Hyderabad
April 25, 2024 09: 52 AM
Slider విజయనగరం

నూత‌న విద్యా విధానంతో బంగారు భ‌విష్య‌త్తు..!

#neweducationpolicy

జిల్లా స్థాయి అవ‌గాహ‌న స‌దస్సులో జ‌డ్పీ చైర్మన్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు

నూత‌న జాతీయ విద్యా విధానం -2020తో భావిత‌ర విద్యార్థుల‌కు బంగారు భ‌విష్య‌త్తు క‌లుగుతుంద‌ని  విజయనగరం జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. విద్యా విధానంలో వచ్చే మార్పుల వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఒన‌గూరుతాయ‌ని, వాటిని రాబోయే త‌రాల‌కు అందించాల్సిన నైతిక బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రి పైనా ఉంద‌ని ఆయ‌న ఉద్ధాటించారు. జాతీయ విద్యా విధానం అమ‌లు, ఆచ‌ర‌ణ‌, త‌దిత‌ర అంశాలపై చ‌ర్చించే ఉద్దేశంతో ఆయ‌న ఆధ్వ‌ర్యంలో జిల్లా ప‌రిష‌త్ ప్రాంగ‌ణంలో విస్తృత స్థాయి అవ‌గాహ‌న స‌దస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, ఎమ్మెల్సీ ర‌ఘురాజు, జ‌డ్పీటీసీ స‌భ్యులు, ఎంపీపీలు, ఎంఈవోలు, ప్ర‌ధానోపాధ్యాయులు పాల్గొని ప‌లు అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అమ‌లు ప్ర‌క్రియ‌లో అనుస‌రించాల్సిన విధానాలు, త‌లెత్తే స‌మ‌స్య‌లు, ప‌రిష్కారాలు స‌దస్సులో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌ధానోపాధ్యాయులు లేవనెత్తిన అంశాలకు జిల్లా విద్యాశాఖ అధికారి బ్ర‌హ్మాజీరావు, ఎంఈవోలు స‌మాధానాలు ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ విద్యా ప్ర‌మాణాలు మెరుగుప‌డే విధంగా రూపుదిద్దుకున్న‌ నూత‌న జాతీయ విద్యా విధానాన్ని జిల్లాలో ప‌క‌డ్పందీగా అమ‌లు చేద్దామ‌ని, దానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుందామ‌ని పేర్కొన్నారు. ఈ విధానం అమ‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా భాగ‌స్వామ్యం కావాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న సూచించారు. విద్యా వ్య‌వ‌స్థ‌లో జ‌రిగే సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితాలు భావిత‌రాల‌కు అందేలా ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేయాల‌ని చెప్పారు. మంచి విద్య‌తోనే మంచి స‌మాజ నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో 249 పాఠ‌శాల‌ల విలీన ప్ర‌క్రియ స‌జావుగా జ‌రిగింద‌ని పేర్కొన్నారు. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే నాడు- నేడు రెండో ఫేజ్ అభివృద్ధి ప‌నుల్లో ఈ విలీన పాఠ‌శాల‌ల అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

స‌ద‌స్సులో ప‌లువురు ప్ర‌ధానోపాధ్యాయులు లేవెనెత్తిన అంశాల‌పై జ‌డ్పీ ఛైర్మ‌న్ స్పందించారు. పాఠ‌శాల‌ల మ్యాపింగ్‌లో త‌లెత్తుతున్న స‌మ‌స్య‌ల‌ను మ‌రొక సారి ప‌రిశీలించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యాశాఖ అధికారుల‌ను ఆదేశించారు. పాఠ‌శాల‌ల్లో నాన్ టీచింగ్ స్టాప్‌ను నియ‌మించేందుకు, నైట్ వాచ్‌మెన్ల‌ను నియ‌మించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఛైర్మ‌న్ ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు.

ప్రహ‌రీలు లేని చోట్ల‌, మ‌రుగుదొడ్లు లేని చోట్ల త్వ‌రిత‌గ‌తిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను, డిస్ట్రిక్ట్ కొ-ఆర్డినేట‌ర్ను ఆదేశించారు. అలాగే నెల్లిమ‌ర్ల‌, మ‌క్కువ‌, చీపురుప‌ల్లి త‌దిత‌ర పాఠ‌శాలల్లో అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దులు కావాల‌ని కోర‌గా రిజ‌ల్యూష‌న్ పాస్ చేయాల‌ని జ‌డ్పీ సీఈవోను ఆదేశించారు. నాన్ ప్యాన‌ల్ లిస్ట్ నుంచి పాఠశాల‌ల‌ను తొల‌గించి ప్యాన‌ల్‌లో చేర్చేందుకు, తదుప‌రి చ‌ర్య‌లు తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కొత్త‌వ‌ల‌స, బాడంగి, మెంటాట‌, గంట్యాడ త‌దిత‌ర మండ‌లాల‌ ప‌రిధిలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను స్థానిక జ‌డ్పీటీసీ స‌భ్యులు ఛైర్మ‌న్‌ దృష్టికి తీసుకురాగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను ఛైర్మ‌న్ ఆదేశించారు.

క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ నూత‌న జాతీయ విద్యా విధానం అమ‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ కీల‌క పాత్ర పోషించాల‌ని సూచించారు. సంస్క‌ర‌ణ‌లు చేసేట‌ప్పుడు.. కొత్త విధానం వ‌చ్చేట‌ప్పుడు కొన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వాటిని అధిగ‌మించి మార్పును ఆహ్వానించాల‌ని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు దీనిపై అన‌వ‌సర‌ భ‌యాందోళ‌న‌లు చెంద‌కుండా అమ‌లు చేయాల‌ని, త‌ల్లిదండ్రుల‌కు న‌చ్చ‌జెప్పాల‌ని సూచించారు. పాఠ‌శాల‌ల విలీన క్ర‌మంలో కొన్ని ఇబ్బందులు వ‌స్తున్న మాట వాస్తవ‌మేన‌ని.. కానీ మార్పు కావాలంటే కొన్ని క‌ష్టాల‌ను భ‌రించాల‌ని హిత‌వు ప‌లికారు.

దూర ప్రాంతాల విద్యార్థుల‌ను హైస్కూళ్ల‌కు చేర్చేందుకు ఆయా కార్పొరేష‌న్‌ల ప‌రిధిలో రుణాలు ఇప్పించి వాహ‌నాల‌ను ఏర్పాటు చేసుకొనేలా యోచ‌న చేయాల‌ని ప్ర‌ధానోపాధ్యాయుల‌కు ఆమె సూచించారు. ఈ నూత‌న అవకాశాన్ని అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పేర్కొన్నారు. బాల్య వివాహాల వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను, ఫోర్టిఫైడ్ రైస్ తాలూక ప్ర‌యోజ‌నాల‌ను విద్యార్థుల‌కు, వారి త‌ల్లిదండ్రుల‌కు వివ‌రించాల‌ని ప్ర‌ధానోపాధ్యాయుల‌కు సూచించారు.

అనంత‌రం ఎమ్మెల్సీ ఇందుకూరి ర‌ఘురాజు మాట్లాడుతూ నూత‌న జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా జిల్లాలోని ప్ర‌జాప్ర‌తినిధులు ఆయా మండలాల ప‌రిధిలోని పాఠ‌శాల‌ల‌ను ద‌త్త‌త తీసుకొని అభివృద్ధి చేయాల‌ని పిలుపునిచ్చారు. పిల్ల‌ల భ‌విష్య‌త్తును తీర్చిదిద్దేందుకు స‌మ‌ష్టి కృషి అవ‌స‌రమ‌ని పేర్కొన్నారు. ధృడ‌మైన సంక‌ల్పంతో విద్యారంగ‌ అభివృద్ధికి కృషి చేసి విజ‌య‌న‌గ‌రాన్ని విద్యల న‌గ‌రంగా తీర్చి దిద్దాల‌ని ముక్త కంఠంతో చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా పరిష‌త్ సీఈవో టి. వెంక‌టేశ్వ‌ర‌రావు, జిల్లా విద్యాశాఖ అధికారి బ్ర‌హ్మాజీరావు, ఎస్‌.ఎస్‌.ఎ. పీవో స్వామినాయుడు, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్‌.టి. నాయుడు, సూర్య‌నారాయ‌ణ రాజు, డిప్యూటీ సీఈవో రామ్మెహ‌న్ రావు, నెల్లిమ‌ర్ల ఎంపీడీవో రాజ్ కుమార్‌, జ‌డ్పీటీసీ స‌భ్యులు, ఎంపీపీలు, ఎంఈవోలు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

పి‌ఎస్‌ఆర్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆటల పోటీలు

Murali Krishna

రాజీవ్ స్టేడియంలో అధికారులు వ‌ర్సెస్ ఉద్యోగుల మ‌ధ్య పోటీలు

Satyam NEWS

పాలేరు అసెంబ్లీ నుండి సిపిఎం పోటీ

Satyam NEWS

Leave a Comment