27.3 C
Hyderabad
August 5, 2021 13: 04 PM
Slider సంపాదకీయం

New Game: అమ్మ జగనూ ఇదా నీ ప్లానూ?

CJI tour

అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రద్దయిన ఢిల్లీ పర్యటనను మళ్లీ అకస్మాత్తుగా ఎందుకు పునరుద్ధరించుకున్నారు? ‘యల్లో మీడియా’ విస్తృతంగా ప్రచారం చేసినట్లు బెయిల్ రద్దు వ్యవహారమే ముఖ్య కారణమా?

అది అవునో కాదో ఎవరికి తెలియదు కానీ మరో ముఖ్యమైన కారణం మాత్రం విస్పష్టంగా కనిపిస్తున్నది. ఎన్నో దశాబ్దాల తర్వాత ఒక తెలుగువాడు భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ ఎన్ వి రమణ భారత ప్రధాన నాయమూర్తిగా పదవి చేపట్టిన తర్వాత తొలి సారిగా సొంత రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. భారత ప్రధాన న్యాయమూర్తి అంటే ఆషామాషీ కాదు ప్రోటోకాల్ లో రాష్ట్రపతి, భారత ప్రధాని, లోక్ సభ స్పీకర్ లతో సరి సమానమైన హోదాలో ఉంటారు.

అలాంటి అతి ముఖ్యమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి వస్తుంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా స్వయంగా వెళ్లి స్వాగతం చెప్పాలి. ముఖ్యమంత్రే కాదు రాష్ట్ర గవర్నర్ కూడా వెళ్లి స్వాగతం పలకాలి. తెలంగాణ రాష్ట్రంలో అలానే చేశారు.

ఇది కొత్తగా ఎవరూ చెప్పాల్సిన పని లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలా జరగలేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్వరాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి కాదు కదా కనీసం చిత్తూరు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా ఆయనకు స్వాగతం పలకడానికి వెళ్లలేదు.

ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు అవమానం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవమానం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు స్వాగతం చెప్పడాన్ని తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వాయిదా వేసుకున్న ఢిల్లీ పర్యటనను అకస్మాత్తుగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కావాలనే ఇలా చేశారా? ఆయన మనోగతం ఏమిటి? అనే విషయాలు వెల్లడి అయ్యే అవకాశాలు లేవు కానీ  జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం ఒక ప్లాన్ ప్రకారం ముఖ్యమంత్రి వ్యవహరించారని మాత్రం అర్ధం అవుతున్నది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఖరారు కాలేదని ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వాయిదా పడిందని కొందరు విస్తృతంగా ప్రచారం చేశారు. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిలు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారని కూడా ప్రచారం జరిగింది.

ఈ ప్రచారాల మధ్య రాష్ట్రానికి చీఫ్ జస్టిస్ వస్తున్న విషయం మరుగున పడేలా అధికార పార్టీ సోషల్ మీడియా శతవిధాలా ప్రయత్నించింది. చీఫ్ జస్టిస్ తిరుమల వస్తే టీటీడీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యేలు తప్ప కనీసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా స్వాగతం పలికేందుకు వెళ్లలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానికంగా తిరుపతిలోనే ఉన్నా ఆయన కూడా చీఫ్ జస్టిస్ వద్దకు వెళ్లలేదు.

ఇందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు చాలా మంది వెళ్లి చీఫ్ జస్టిస్ కు స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్ వి రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారని వార్తలు వచ్చిన సమయంలో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలానే ప్రవర్తించింది.

ఆయన పట్ల ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. అయితే చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న వ్యక్తి ఇవన్నీ పట్టించుకోరు. కానీ రాష్ట్రానికే అవమానం అనేది ఎవరూ మర్చిపోరాదు. జస్టిస్ ఎన్ వి రమణ చీఫ్ జస్టిస్ పదవికి ఎంపిక కాక ముందు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనపై పలు ఆరోపణలు చేస్తూ అప్పటి చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు.

ఆ లేఖపై అప్పటి చీఫ్ జస్టిస్ తన అభిప్రాయం చెప్పేలోపునే మీడియాకు వెల్లడించి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అయినా సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి అయిన జస్టిస్ ఎన్ వి రమణనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి వరించింది. ఈ మొత్తం సంఘటనలను దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ విధంగా ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారా? మొహం చాటేశారా? అనే విషయాలు రుజువు కాదు కానీ జరిగిన పరిణామాలను చూసి మనమే ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది.

Related posts

క‌రోనా వ్యాధిని అరిక‌ట్టేందుకు అన్నివిధాలా స‌హ‌కారం

Satyam NEWS

ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

తలసేమియా పేషంట్లకు అంబులెన్సు సౌకర్యం ఉచితం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!