మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దుండగులు 9 ఎంఎం పిస్టళ్లతో అతనిపై కాల్పులు జరపడంతో బాబా సిద్ధిఖీ ఘటనాస్థలంలోనే మరణించారు. ఈ హత్యకు తామే బాధ్యుమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటనతో పరిస్థితి మరింత వేడెక్కింది. బాబా సిద్ధిఖీని తామే చంపినట్టు ఈ గ్యాంగ్ స్వయంగా ప్రకటించుకోవడం ముంబై పోలీసుల దృష్టిని మరింతగా ఆకర్షించింది. బాబా సిద్ధిఖీ హత్యపై పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు చేసిన ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు సిద్దిఖీపై దాడి చేయడానికి నెల రోజులు రెక్కీ చేసినట్టు గుర్తించారు. హత్యకు ముందు ఒక్కొక్కరికి రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చినట్టు కూడా సమాచారం. నిందితులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆయుధాలు సరఫరా చేసినట్టు తేలింది. బాబా సిద్ధిఖీ, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సన్నిహితుడు కావడం ఈ హత్యకు మరింత ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను చాలాకాలంగా టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం సల్మాన్ సన్నిహితుడి హత్య నేపథ్యంలో ఆయన భద్రతపై మరింత అప్రమత్తం అయ్యారు. ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద భద్రతను గణనీయంగా పెంచారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను ఎందుకు టార్గెట్ చేస్తుందనే అంశంపై ఇప్పటికీ విస్తృతంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ హత్య నేపథ్యంలో, ఆయనపై మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సల్మాన్ భద్రతను పునర్నిర్మాణం చేసి, ఆయనపై ఎలాంటి ప్రమాదం రానీయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ముంబై పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు ప్రస్తుతం ముంబై క్రైం బ్రాంచ్ ఆధ్వర్యంలో సీరియస్ దర్యాప్తు జరుగుతుండగా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.