35.2 C
Hyderabad
April 24, 2024 11: 04 AM
Slider ప్రత్యేకం

పేపర్ ట్రబుల్: ఆదాయం లేక అగాధంలోకి

#Newspapers in India

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాల తో పాటు మీడియాను కూడా తీవ్రంగా నష్టపరుస్తోంది. ప్రాణాలకు తెగించి కోవిడ్-19 కు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు బాహ్య ప్రపంచానికి అందించడంలో మీడియా పోషిస్తున్న పాత్ర  అమోఘం.

ప్రజలకు విశ్వసనీయతతో,అంకిత భావంతో కూడిన విలువైన సమాచారాన్ని  చేరవేసేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు చేస్తున్న కృషిని ఐక్యరాజ్య సమితి ,యునెస్కో, డబ్ల్యూ హెచ్ ఓ, ఐఎల్ఓ వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తున్నాయి.

దారుణ ఆర్ధిక దుస్థితిలోకి పత్రికలు

భారత దేశం విషయానికి వస్తే దేశవ్యాప్తంగా సుమారు 800 పైగా వార్తాపత్రికలు ప్రచురణ రంగంలో ఉన్నట్లు ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐ ఎన్ ఎస్) తెలిపింది. స్థానిక వార్తలు మొదలు అంతర్జాతీయ వార్తలు, విశేషాలు, కథనాలను ఎప్పటికప్పుడు చదువరులకు అందిస్తున్నాయి.

సుమారు 9-10 లక్షల మంది ప్రత్యక్షంగా, మరో 18-20 లక్షల మంది పరోక్షంగా ప్రింట్ మీడియాలో పనిచేస్తున్నట్లు ఐ ఎన్ ఎస్ తాజాగా తెలిపింది. ప్రస్తుత కరోనా తీవ్ర సంక్షోభం కారణంగా ప్రింట్ మీడియా రంగంలో  కూడా దారుణమైన ఆర్థిక దుస్థితి నెలకొంది.

రోజు రోజుకూ పెరుగుతున్న పత్రికల నష్టం

ఐ ఎన్ ఎస్ అంచనా ప్రకారం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలలో దాదాపు 4000-4500 లక్షల నష్టాన్ని ఈ రంగం చవి చూసింది. అంతేకాదు  రానున్న  6,7  నెలల కాలంలో 12000-15000 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లగలదని తెలుస్తోంది. ఇప్పటికే కుదేలైన ప్రింట్ మీడియా పలు విభాగాలలో విధులు నిర్వహిస్తున్న సంపాదక వర్గం, న్యూస్ రిపోర్టర్లు, మార్కెటింగ్, ప్యాకింగ్, డెలివరీ తదితరులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ఐ ఎన్ ఎస్ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వమే ప్రింట్ మీడియాను ఆదుకోవాలి

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రింట్ మీడియాను తగిన విధంగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సకల వ్యాపార ,వాణిజ్యాలు స్థంభించిన నేపథ్యంలో  మీడియా కు ప్రకటనలు వచ్చే పరిస్థితి ఇప్పట్లో అసాధ్యమని సొసైటీ అభిప్రాయపడుతోంది.

కోవిడ్-19 ని సమర్ధవంతంగా ఎదుర్కునే ప్రక్రియలో మీడియా నిర్వహిస్తున్న పాత్రను ప్రధానమంత్రి సందర్భోచితంగా ప్రశంసిస్తున్నారు.. ప్రధాని కి ప్రింట్ మీడియా పట్ల ఉన్న విశేషమైన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలు అవసరమని ఐ ఎన్ ఎస్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

న్యూస్ ప్రింట్ పై దిగుమతి సుంకం తీసేయాలి

ప్రస్తుతం న్యూస్ ప్రింట్ పై అమలులో ఉన్న 5% దిగుమతి సుంకాన్ని తొలగించాలని, రానున్న రెండు సంవత్సరాల వరకు పన్ను వసూళ్లకు విరా మం ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న ప్రకటన రేట్లను 50 శాతం పెంచాలని,  కేంద్రప్రభుత్వ బడ్జెట్ లో 200 శాతం ప్రింట్ మీడియా రంగానికి కేటాయిచాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

తగిన రీతిలో మిగతా రంగానికి ఇస్తున్న విధం గానే కష్టనష్టాలు లో ఉన్న ప్రింట్ మీడియాకు కూడా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఐ ఎన్ ఎస్ ప్రభుత్వాన్ని  అభ్యర్థిస్తోంది. ప్రతీ రోజు ఆర్ధిక నష్టాలు కుది పేస్తున్నా సమాచారాన్ని నిర్విరామంగా అందిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా కృషి చేస్తున్న మీడియా రంగాన్ని ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని పౌర సమాజం, ప్రజాస్వామ్య ప్రియులు అభిలాష వ్యక్తంచేస్తున్నారు.

ఆ దిశగా ప్రభత్వం సత్వరం సానుకూలంగా స్పందించి ప్రింట్ మీడియాకు ఆపన్న హస్తం అందిస్తే ఒక ప్రధాన సమాచార వ్యవస్థ జీవం పోసుకుంటుంది.

కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

పిడుగురాళ్లలో 30 ఏళ్ల యువకుడికి అనారోగ్యం

Satyam NEWS

కాలభైరవుడి ఆలయంలో క్షుద్రపూజల కలకలం

Satyam NEWS

ఎమ్మెల్సీ అభ్యర్థిగా దూడపాక సంజీవ నామినేషన్ దాఖలు

Satyam NEWS

Leave a Comment