జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్ఆర్‌సీ) ముందు హాజరు కావడానికి నిరాకరించిన దిశ తండ్రి సోదరిని పోలీసులు ఎట్టకేలకు ఓప్పించి వాగ్మూలం ఇచ్చేలా చేశారు. దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఎన్‌హెచ్ఆర్‌సీ తన విచారణ కొనసాగిస్తోంది.
శంషాబాద్‌లో దిశ నివాసానికి వచ్చిన పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో దిశ తండ్రి, సోదరిని తెలంగాణ పోలీస్ అకాడమీకి తీసుకెళ్లారు. జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు అరగంటపాటు దిశ తండ్రి, సోదరిని విచారించి వివరాలు సేకరించారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
ఘటన జరిగిన రోజు, ఆ తర్వాతి రోజు పరిణామాలపై జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదట ఎన్‌హెచ్ఆర్‌సీ విచారణకు వెళ్లేందుకు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దిశ దశ దిన కర్మ రోజున విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు.
దీంతో దిశ కుటుంబసభ్యులకు మద్దతుగా స్థానికులు కూడా నిలిచారు. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికి దిశ నివాసానికి చేరుకున్న పోలీసు అధికారులు దిశ తండ్రి, సోదరిని ఒప్పించి ఎన్‌హెచ్ఆర్‌సీ విచారణకు ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు. దిశ తల్లి అనారోగ్యంపాలు కావడంతో ఆమె విచారణకు హాజరుకాలేదు.
నిందితుల దాడిలో గాయాలపాలైన ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్‌ను కూడా ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యులు విచారించి, వారి వాంగ్మూలాలను కూడా తీసుకున్నారు.