కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు ఎవరికి సంతృప్తి కలిగించడం లేదు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ సైతం బిజెపి అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన దేశ ఆర్ధిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. దేశంలో ఆర్ధిక మాంద్యం ఉందన్న విషయాన్ని బిజెపి అంగీకరించకపోవడం పట్ల పరకాల ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఒక్కో రంగం దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నా కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆర్ధిక మందగమనాన్ని అంగీకరించకపోవడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. హిందూ పత్రికకు ఆయన రాసిన వ్యాసంలో దేశ ఆర్ధిక పరిస్థితిని దుయ్యబట్టారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొనడానికి బిజెపి వద్ద ఎలాంటి వ్యూహం ఉన్నట్లు కనిపించడం లేదని ఆయన తన వ్యాసంలో విమర్శించారు. ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొనడానికి బిజెపి తన సొంత పంధా అనుసరించేందుకు కూడా ఎందుకో సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదని ఆయన అన్నారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అనుసరించిన ఆర్ధిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే బిజెపి తన సొంత అభిప్రాయాలను అయినా స్థిరంగా అమలు చేయాలని అయితే అలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదని పరకాల ప్రభాకర్ అంటున్నారు. నెహ్రూవిధానాలను వ్యతిరేకించడం ఒక్కటే సిద్ధాంతం కారాదని, తమ సొంత విధానాలు ఉండాలి కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ముందుగా కొన్ని రాష్ట్రాలలో ఆ తర్వాత కేంద్రంలో మరి కొన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన బిజెపి తమను ఎన్నుకున్న ప్రజల అవసరాలు తీర్చే ఆర్ధిక విధానాలను ఇప్పటికే రూపొందించుకుని ఉండాల్సిందని అప్పుడే ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు వీలుంటుందని అలా కాని పక్షంలో ప్రజల ఆశలు వమ్ము చేసినట్లు అవుతుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ తమ ఆర్ధిక విధానాన్ని బిజెపి రూపొందించుకోనందు వల్లే తాము రెండో సారి గెలవడానికి తమ ఆర్ధిక విధానాలే కారణమనే విషయాన్ని గట్టిగా చెప్పలేకపోతున్నారని పరకాల ప్రభాకర్ విమర్శించారు. ఆర్ధిక విధానాలలో ఉన్న డొల్ల తనం వల్లే బలమైన రాజకీయ వ్యవస్థ, జాతీయత తదితర అంశాలను బిజెపి పైకి తీసుకువస్తున్నదని పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. నెహ్రూ అనుసరించిన విధానాలను వ్యతిరేకించడం కేవలం రాకీయ అత్యాచారం కిందికే వస్తుంది తప్ప ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాన్ని రూపొందించేందుకు వీలుకలిగించదని పరకాల ప్రభాకర్ నిశితంగా విమర్శించారు.
previous post