నిజామాబాద్ ఓటర్లను మోసం చేసిన పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్ధి జేఏసీ డిమాండ్ చేసింది. ఎంపీ ఆరవింద్ ఫోటో కి కొమ్ములు పెట్టి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యం లో నేడు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. పసుపు బోర్డును తీసుకువస్తానని పసుపు రైతులకు ఎన్నికల్లో ఎంపీ అరవింద్ మాట ఇచ్చి మోసం చేశాడని ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ ఆరోపించింది.

బోర్డు అంబాసిడర్ కారులాంటిదని, అలా కాకుండా అంతకు మించి టయోట కారు లాంటి సంస్థను తీసుకువస్తానని చెబుతూ రైతులను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్న అరవింద్ తక్షణమే పదవి నుంచి వైదొలగాలని వారు డిమాండ్ చేశారు. తప్పుడు వాగ్దానాలతో రైతులను కించపరచడం సరికాదని, ఎన్నికల్లో గుర్తుకు రాని కార్లు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చాయని వారు ప్రశ్నించారు.
బాండు పేపర్ మీద పసుపు బోర్డు 5 రోజుల్లో తెస్తామని చెప్పారు ఇప్పుడు ఏమైంది? ఇదేనా రాజకీయం అంటే అని వారు ప్రశ్నించారు. డిసెంబర్ 31 వరకు పసుపు బోర్డు తేలేక పోతే ఆయనకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటిస్తామని వారు తెలిపారు.