28.7 C
Hyderabad
April 20, 2024 04: 45 AM
Slider ప్రత్యేకం

భూ మాఫియా కోసమే ధరణి: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

#dharmapuriaravindh

భూ మాఫియా కోసమే ధరణి పోర్టల్ ఏర్పాటు చేశారని, దీని ద్వారా లక్షల కోట్ల విలువ చేసే భూములను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న ఎంపీ అరవింద్ రామారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకుని రమణారెడ్డిని పరామర్శించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. ధరణి వల్ల ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. దొరల పాలనలో అన్ని వ్యవస్థలు నాశనం చేశారన్నారు. కేసీఆర్ అనే దుర్మార్గుడు 9 ఏళ్లలో ఏమి తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితబంధు తెస్తాం అని చెప్తున్నారని అది తెచ్చే లోపు సచ్చిపోతావని విమర్శించారు.

మునుగోడు ఎన్నికల కోసమే గిరిజన బంధు

ప్రధానమంత్రి గ్రామ వికాస్ యోజన ద్వారా 3.20 కోట్ల ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు గృహప్రవేశాలు కూడా చేశామని, ఇందులో 69 శాతానికి పైగా మహిళల పేర్లపైనే కేటాయించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేయడానికే స్థలం ఉన్నోళ్లకు మూడు లక్షలు ఇస్తామంటున్నారని విమర్శించారు. మునుగోడు ఎన్నికల కోసమే గిరిజనబంధు అన్నారు. యూనివర్సిటీలకు ప్రొఫెసర్లు లేరని, విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని, చివరికి మెస్ దందా కూడా వదలడం లేదన్నారు.

ఆస్పత్రుల్లో వైద్యులు లేరని, గతంలో ఎన్ఆర్ఐలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందేదని, ఇప్పుడు వాళ్ళ మాట కూడా ఎత్తడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 17 వేల కోట్ల నిధులిస్తే ఆ నిధులను కాళేశ్వరానికి మళ్లించి కమిషన్ మింగారన్నారు. వర్షాలకు రైతుల పంటలు నష్టపోతే రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీని, బీజేపీ కార్యకర్తలను తొక్కిపెట్టేందుకే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నారని ఆరోపించారు.

మాకంటే ఎక్కువగా కిందిస్థాయి పోలీసు సిబ్బందే కేసీఆర్ ను తిడుతున్నారని చెప్పారు. నిన్ను నీ కుటుంబాన్ని ఇదే పోలీసులతో జైలుకు పంపకపోతే, ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలు చూడకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు. బతుకమ్మ స్పెషలిస్ట్.. వెనక గుడుంబా, సారా దందా చేసే వాళ్లు అంటూ ఎమ్మెల్సీ కవితనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈసారి బతుకమ్మ ఆడటానికి ఆస్ట్రేలియా వెళ్ళేది విల్లాలు, ప్లాట్లు కొనుగోలు చేసేందుకని విమర్శించారు. ఒకరేమో సారా వ్యాపారం.. మరొకరు డ్రగ్స్.. పెద్దాయనేమో నేషనల్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు.

ఇక టిఆర్ఎస్ బంద్ అవుతుందట.. బీఆర్ఎస్ దసరాకు వస్తుందట.. ఈ ముచ్చట చెప్పవట్టి మూడేళ్లు అవుతుందని, ఈ దసరాకు అయినా చూస్తామా అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇవ్వనోడు గిరిజన బంధు ఇస్తాడట అన్నారు. కామారెడ్డిలో బల్లగుద్ధి చెప్తున్నా.. ఇక్కడి కార్యకర్తలు బీజేపీని గెలిచే స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. వెంకట రమణారెడ్డి లాంటి నాయకుల పోరాటంతో 2023 లో కామారెడ్డిలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ను శుద్ధి చేస్తామని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇస్తలేరు.. దళితబంధు, గిరిజన బంధు ఇస్తారట అన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, మిషన్ కాకతీయ కాగితాలకే పరిమితమైందన్నారు. ఈ మూడు పథకాలకు రెండున్నర లక్షల కోట్లు ఖర్చయ్యాయన్నారు. టిఆర్ఎస్ మేనిఫెస్టో చదివి చెప్పుకుంటు పోటీ పాపాల చిట్టా చెప్పడానికి సమయం సరిపోదన్నారు. మేనిఫెస్టోలో పాలకు 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామన్నారని, కల్లు గీత కార్మికులకు నీరాను సాఫ్ట్ డ్రింక్ చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్ చేస్తామన్నారని ఎద్దేవా చేశారు. వెంకట రమణారెడ్డి చేస్తున్న పోరాట ఫలితం బీజేపీకి దొరుకుతుందని తెలిపారు

పోలీసుల హైడ్రామా

వెంకట రమణారెడ్డి అరెస్ట్ పోలీసుల హైడ్రామా నడుమ కొనసాగింది. కామారెడ్డిలోని ఆయన ఇంటివద్ద రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మధ్యాహ్నం 1:30 నిమిశాలకు కామారెడ్డికి రావాల్సిన ఎంపీ అరవింద్ షెడ్యూల్ డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ కు మారింది. ఎంపీ వస్తున్న సమాచారం తెలుసుకున్న బీజేపీ ఉమ్మడి జిల్లా కార్యకర్తలు పెద్ద ఎత్తున డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో అక్కడినుంచి రమణారెడ్డిని మూడు పోలీసు వాహనాల్లో తిప్పుతూ దర్పల్లి వైపు నుంచి సిర్నాపల్లి తీసుకెళ్లారు. అక్కడికి బీజేపీ కార్యకర్తలు రావడంతో అక్కడి నుంచి రామారెడ్డి పోలీసు స్టేషన్ కు తరలించారు.

కొనసాగుతున్న ఆమరణ దీక్ష

ధరణి పోర్టల్ వల్ల రైతుల సమస్యలు తీరే వరకు తన పోరాటం ఆపేది లేదని వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్లో తన ఆమరణ నిరాహార దీక్షను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసులు భోజనం, నీరు అందజేసిన వాటిని ముట్టుకోలేదు. ధరణి సమస్యలపై తాడో పేడో తేల్చుకునేదాక తన నిరాహార దీక్ష పోలీస్ స్టేషన్లోనే కొనసాగుతుందని, సమస్య తీరేవరకు తమ నిరసన కొనసాగుతుందని కార్యకర్తలు ఎక్కడికక్కడ గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలని వెంకట రమణారెడ్డి తమ కార్యకర్తలకు సందేశాన్ని చేరవేశారు.

Related posts

3808 చెక్కులకు గాను రూ.16.11 కోట్లు పంపిణీ

Murali Krishna

ప్రపంచ యవనికపై తెలంగాణ పర్యాటకం…

Bhavani

వ్యాక్సిన్ అపోహలపై పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్

Satyam NEWS

Leave a Comment