ఇది నిర్లిప్తమైన బడ్జెట్ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేదని ఆయన అన్నారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ రెండవ సారి అధికారం చేపట్టినా సొంతంగా చెప్పుకునే ఒక్క ఫ్లాగ్ షిప్ పథకం కూడా లేకపోవడం బాధాకరమని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఆయా శాఖలకు పద్దుల కేటాయింపులో కొత్త ఆలోచనలు ఏమీ లేవని, రొటీన్ గా కేటాయింపులు చేశారని అన్నారు.
యంగ్ దేశంగా చిత్రీకరిస్తు.. యువ తరానికి ఒక్క పథకం కూడా ప్రకటించలేదని వినోద్ కుమార్ విమర్శించారు. స్కిల్ డెవలప్ మెంట్ కోసం నయా పైసా కూడా బడ్జెట్ లో పెంచలేదని ఆయన అన్నారు. విద్యా, ఆరోగ్యం ముఖ్యమని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో మాత్రం కేటాయింపులు చేయలేదని వినోద్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ కోణంలో చూసినా బడ్జెట్ లో కొత్తదనం కనిపించడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని వినోద్ కుమార్ తెలిపారు.