భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ గురించి ఇంకా ఉత్కంఠ వీడటం లేదు. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీల దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్పటి నుంచి ఈ ల్యాండర్‌తో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇక దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా తన సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఇక నాసా ప్రయోగించిన లూనార్ రికాయిన్నెసెన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్ఓ) మంగళవారం చంద్రుడి ఉపరితలానికి చేరుకొని.. విక్రమ్ ల్యాండ్ అయిన ప్రాంతం నుంచి ప్రయాణం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ల్యాండర్ ఉన్న ప్రాంతాన్ని ఫొటోలు తీసినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఇస్రో ఓ ట్వీట్ చేసింది. ‘‘మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, కలల స్ఫూర్తితో మేము ముందుకు సాగుతాం’’ అని ఇస్రో ట్వీట్ చేసింది. దీంతో ‘చంద్రయాన్ 2’ ప్రయోగం విఫలైమంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇస్రో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీటి జాడను కనుగొనేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. జూన్ 22న నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్ 2 ఆ తరవాత ఒక్కో దశను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి ఉపరితల కక్ష్యలోకి చేరింది. అక్కడ ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి మీద దిగడానికి 2.1కి.మీల దూరంలో ఉండగా సంకేతాలు ఇవ్వడం మానేసింది. దీంతో విక్రమ్ ల్యాండర్ బలంగా చంద్రుడి భూతలాన్ని ఢీకొట్టిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక ఆ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఆర్బిటర్ పంపిన ఫొటోలతో ల్యాండర్ ముక్కలు అవ్వలేదని నిర్దారణకు వచ్చారు. ఆ తరువాత విక్రమ్ ల్యాండర్‌తో సంకేతాలు పునరుద్ధరించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. మరి ల్యాండర్ పరిస్థితి ఏమిటి?
previous post
next post