33.2 C
Hyderabad
April 26, 2024 01: 00 AM
Slider జాతీయం

ఈ కాంగ్రెస్ కు బుద్ధి రాదు… వచ్చే అవకాశం కూడా లేదు

#soniagandhi

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో  ఘోర పరాజయం చవిచూసిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు లేదు. పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా పంజాబ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వాస్తవాన్ని ఆ పార్టీ ఇప్పటికీ గుర్తించకపోవడం రాజకీయ పరిశీలకులకు విస్మయం కలిగిస్తోంది. రాహుల్ గాంధీ ఏ అధికారిక హోదాతో పంజాబ్ వెళ్ళి చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ సూటిగా ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ వంటి వారి డిమాండ్ పై స్పందిస్తూ , రాహుల్ గాంధీ ఇప్పటికే డి ఫ్యాక్టో అధ్యక్షుడిగా  వ్యవహరిస్తున్నారని కపిల్ సిబాల్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలను  పార్టీ విప్ మాణిక్కం ఠాగూర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లెత్ తదితరులు తీవ్రంగా ఖండించారు.

సోనియాగాంధీ నాయకత్వానికి ఇంకా సమర్ధన

సిబల్ ది ఆరెస్సెస్ భాష అని వారు దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాల అనంతరం సీ డబ్ల్యు సీ సమావేశమై సోనియా గాంధీ నాయకత్వాన్ని సమర్ధించడం తెలిసిందే. అయితే… ఈ నిర్ణయంపై కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా లేరని, గాంధీలు నియమించే కమిటీ వారిని పదవినుంచి తప్పుకోమని చెప్పలేదు కనుక వారే స్వచ్ఛందంగా తప్పుకోవాలని సిబాల్ అన్నారు.

పార్టీలో సమూల మార్పులు అవసరం అని గతంలో సోనియాకు లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలలో సిబాల్ కూడా ఉండడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో గుబులు పుట్టిస్తోంది. అయితే.. ఆగస్టు 21- సెప్టెంబర్ 20 మధ్య జరిగే సంస్థాగత ఎన్నికలలో పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని ,అప్పటివరకు  సోనియా గాంధీ ఆ పదవిలో కొనసాగుతారని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రకటించారు.

పార్టీ పదవుల నుంచి వెళ్లిపోతామన్న గాంధీయులు

ఒక దశలో.. పార్టీ పదవులకు రాజీనామా చేయాలని సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా సిద్ధపడినా, కమిటీ సభ్యులు ఆ ప్రతిపాదనను ఏక్రీవంగా తిరస్కరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీలో అంతర్గత కలహాలు ఎన్నికలలో ఓటమికి ప్రధాన కారణమని సీ డబ్ల్యూ సీ అంగీకరించిందనీ, రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024  సార్వత్రిక ఎన్నికల సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునే లక్ష్యంగా పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధమవుతుం దని అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా పరాజయం నేపథ్యంలో ఆ ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లపై పార్టీ అధినేత్రి వేటు వేసి, కొత్త పీసీసీ లను నియమించడం పార్టీకి ఎంతవరకు మేలు చేస్తాయనేది  వారి పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యహరించాల్సిందిగా ఐదు రాష్ట్రాలలో గెలిచిన కాంగ్రెస్ శాసనసభ్యులకు దిశా నిర్దేశం చేసే బాధ్యతను పార్టీ అధిష్టానం తీసుకోవడమే కాకుండా పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేస్తామని కాంగ్రెస్ వర్కిగ్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది.

జీ 23 సోనియాకు వ్యతిరేకం కాదు

జీ –  23 కేవలం మీడియా సృష్టి అని, సోనియా గాంధీ నాయకత్వంపై ఎలాంటి వివాదం లేదని  కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అనడం విశేషం.ఇందుకు తగ్గట్లే జీ – 23 అనేది కాంగ్రెస్ లో భాగమే కానీ గాంధీ కుటుంబానికి వ్యతిరేకం కాదని కూటమి నేత మణి శంకర్ అయ్యర్ స్పష్టం చేశారు. అయితే…అతి ముఖ్యమైన ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి జీ – 23 కూటమికి చెందిన గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ మాత్రమే హాజరు కావడం పార్టీలో అసమ్మతి సెగ ఇంకా మిగిలే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అంతర్గత సంఘర్షణ టీ కప్పులో తుపాను అనుకోవాలా? లేదా అనేది తెలియాలంటే సంస్థాగత ఎన్నికలవరకు నిరీక్షణ తప్పదు. ఏది ఏమైనా ముగ్గురు ప్రధానులను ఈ దేశానికి అందించిన సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం పొందాలంటే సమూల ప్రక్షాళన తప్పదని రాజకీయ విమర్శకులు సూచిస్తున్నారు.

మునిపోతున్న ఓడలాంటి కాంగ్రెస్ పార్టీ వల్ల  భాజపా వ్యతిరేక శిబిరానికి ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాటలు గమనార్హం. ఇటువంటి అపప్రధను పోగొట్టుకోవడానికి

కాంగ్రెస్ కొన్ని త్యాగాలకు సైతం సిద్ధం కావాలని అసంఖ్యాక కాంగ్రెస్ కార్యకర్తలు కోరడం అర్థవంతమే కాదు సముచితం కూడా.

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ విశ్లేషకుడు  

Related posts

లో వాటర్  ప్రెషర్  సమస్యకి శాశ్వత పరిష్కారం

Satyam NEWS

గోండులకు నిత్యావసర వస్తువులు పంచిన పోలీసులు

Satyam NEWS

నారాయణ పరివారానికి ముందస్తు బెయిల్ మంజూరు

Satyam NEWS

Leave a Comment