ప్రస్తుతం తెలంగాణ సెక్రటేరియేట్ పని చేస్తున్న బూర్గుల రామకృష్ణారావు భవనం ఎంత మేరకు సురక్షితమైనది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే చాలా కాలం కిందట అంటే దాదాపుగా 40 ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనం లో సౌకర్యాలు కోరుకోవడం మాట అటుంచి భద్రత కావాలనుకోవడం కూడా తప్పే అవుతుంది. బూర్గుల రామకృష్ణారావు భవన్ ను కేవలం 500 మంది ఉద్యోగులు పని చేసేందుకు నిర్దేశించుకుని నిర్మించారు. పార్కింగ్ తో సహా అన్ని సౌకర్యాలూ 500 మందికి మాత్రమే ఉంటాయి. అయితే అందులో ఇప్పుడు సచివాలయం లో పని చేసే సిబ్బంది మొత్తాన్నీ అంటే దాదాపుగా 1500 మందికి పైగా సిబ్బందిని తొసేస్తున్నారు. స్కూలు పిల్లల్ని ఆటోలో కుక్కినట్లు. ఈ సిబ్బందికి తోడు ఉన్నతాధికారులు, మంత్రులు…. వీరంతా ఎక్కడ కూర్చుంటారో అనుమానమే. వారు కూర్చున్నా వారితో పని చేసే సిబ్బంది కూర్చోడానికి స్టూలు కూడా పట్టదు. కూర్చోడం ఏముంది ఎక్కడైన కూర్చోవచ్చుకానీ పురాతనమైన ఈ భవనం ఎంత వరకూ క్షేమమైనది అనే ప్రశ్న కూడా తలెత్తుతున్నది. బూర్గుల రామకృష్ణారావు భవన్ ను రాష్ట్రం విడిపోయినప్పుడు 52:48 నిష్పత్తిలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు పంచుకున్నాయి. ఆ నాటి నుంచి మొత్తం 3 లక్షల చదరపు గజాలలో 52 శాతం భవనం వినియోగంలో లేదు. దాదాపుగా 6 సంవత్సరాల పాటు భవనంలోని ఈ భాగం పాడుపడిపోయి ఉంది. ఇప్పుడు సుత్తెపెట్టి మేకు కొడుతుంటే పెచ్చులు ఊడిపడిపోతున్నాయి. ఫైర్ సేఫ్టీ అస్సలు లేదు. భవనం నిర్మించినపుడు పెట్టిన ఫైర్ సేఫ్టీ పరికరాలే ఉన్నాయి. ఆ వ్యవస్థ పని చేస్తుందో లేదో కూడా ఎవరూ చెప్పడం లేదు. 500 మంది సిబ్బంది ని మాత్రమే క్యారీ చేయగల ఈ భవనంలో మురుగునీటి పారుదల సౌకర్యం కూడా లేదు. టాయిలెట్లు సరిపడేన్ని లేవు. ఉన్న కొన్ని కూడా ఆమడ దూరం వరకూ కంపు కొడుతుంటాయి. అన్ని అసౌకర్యాల మధ్య సచివాలయ సిబ్బంది పని చేయాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్ నుంచి భవనం భద్రత వరకూ అన్నీ సమస్యలే ఉన్నాయి. జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలనేది ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఉత్పన్నం అవుతున్న ప్రశ్న. సువిశాలమైన సచివాలయంలోని అధునాతన భవనాలను వదిలి అత్యంత పురాతనమైన బూర్గుల రామకృష్ణారావు భవన్ కు వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడకపోయినా బలవంతంగా పంపుతున్నారు.
previous post
next post