38.2 C
Hyderabad
April 25, 2024 12: 48 PM
Slider ప్రత్యేకం

ఛార్జిషీటులో తప్పేముంది?: కామారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు

#kamareddy

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటనలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పై విడుదల చేసిన ఛార్జిషీటులో తప్పేముందని డిసిసి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. షబ్బీర్ ఆలీపై గంప గోవర్ధన్ చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ నివాసంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. కామారెడ్డి మున్సిపాలిటీ నుంచి 3 కోట్ల రూపాయలను అబ్దుల్లా నగర్ శివారులో రోడ్డు వేసిన విషయం నిజం కాదా అన్నారు.

కామారెడ్డి పట్టణంలో అభివృద్ధికి నోచుకోని, సమస్యలు ఉన్న వార్డులు ఎన్ని ఉన్నా నియోజకవర్గానికి సంబంధం లేని ప్రాంతంలో మీ స్వప్రయోజనాల కోసం రోడ్డు వేయించలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై ఛార్జ్ షీట్ విడుదల చేసింది రాష్ట్ర కమిటీ అని తెలిపారు. గూగుల్ ద్వారా సర్చ్ చేసి రాష్ట్ర నాయకత్వమే చార్జిషీట్ విడుదల చేసిందని చెప్పారు. గంప గోవర్ధన్ వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

4 సార్లు గెలిచి ఏం అభివృద్ధి చేశారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. షబ్బీర్ అలీ రెండుసార్లు గెలిచినా రాష్ట్రంలోనే కామారెడ్డికి ప్రత్యేక స్థానం తెచ్చారన్నారు. సాగునీరు, తాగునీరు అందించడానికి ప్రయత్నించారన్నారు. షబ్బీర్ అలీ హయాంలో కామారెడ్డి అభివృద్ధి 20సంవత్సరాలకు ముందుకు వెళ్లిందన్నారు. మీ జాతకాలు ఎవరికి తెలియవన్న ఆయన కామారెడ్డికి అధికారులు ఎవరు రావాలన్న గంప ఆశీస్సులు కావాలన్నారు.

అధికారంలో ఉన్నావు కాబట్టే విమర్శలు చేస్తారని, వాటికి సమాధానం చెప్పాలన్నారు. సీఎం కేసీఆరే అసెంబ్లీ సాక్షిగా షబ్బీర్ అలీ అభివృద్ధిని ప్రశంసించారని, మీ సీఎంనే విమర్శిస్తావా అని ప్రశ్నించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి బాన్సువాడకు తరలిస్తే ఆపలేని అసమర్థ ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు. మీ అనుచరులు భూ దందాలు చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

షబ్బీర్ అలీని విమర్శించే హక్కు గంపకు లేదన్నారు. బజాప్త చార్జిషీట్ వేస్తాం.. నిలదిస్తాం.. అడుగుతామని స్పష్టం చేశారు. గంప గోవర్ధన్ అవినీతి పెచ్చుమీరిందని, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వవద్దని ఆ పార్టీ నాయకులే సీఎంకు ఫిర్యాదు చేయలేదా.. బహిరంగ లేఖ రాయలేదా అని ప్రశ్నించారు. షబ్బీర్ అలీ భార్యపై గంప విమర్శలు చేయడం తగదన్నారు. ఆయన ఇంట్లో కూడా మహిళలు ఉంటారని, ఇలాంటి వ్యాఖ్యలు చేసి మహిళల గౌరవానికి  భంగం కలిగించవద్దన్నారు. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

షబ్బీర్ అలీ ఆస్తుల వివరాలు గత ఎన్నికల సమయంలోనే గాంధీ గంజిలో చెప్పారని, ఆరోజు ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా పారిపోయారని విమర్శించారు. గంప గోవర్ధన్ కు ఆస్తులు బినామీల పేరున ఉన్నాయని, షబ్బీర్ ఆలీకి పూర్వకాలం నుంచే ఆస్తులున్నాయని తెలిపారు. ఆస్తుల విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి రవిప్రసాద్, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, ఎన్.ఎస్.యూ.ఐ నాయకుడు సందీప్, గణేష్ నాయక్, గోనె శ్రీనివాస్, చందు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర విజిలెన్స్ నివేదిక ఆధారంగానే దాడులు

Murali Krishna

అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు

Satyam NEWS

క్యాచింగ్:మిక్సీలో బంగారం దాచిన డేగ కళ్ళతో పసిగట్టి

Satyam NEWS

Leave a Comment