Slider తెలంగాణ ముఖ్యంశాలు

మీడియా హైప్ తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏదీ?

j p nadda

తెలంగాణలో బిజెపిని ఎల్లో మీడియా మునగచెట్టు ఎక్కిస్తున్నది. వాస్తవ బలం కన్నా ఎక్కువ చేసి చూపిస్తున్నది. ఇప్పడి వరకూ జరగని విధంగా స్థానిక నాయకులు బిజెపి వైపు ఆకర్షితులవుతున్న మాట వాస్తవమే కానీ ఆ ప్రాంతం మొత్తాన్నీ ప్రభావితం చేయగలవారు చేరడం లేదనేది కూడా నిజం. పార్లమెంటు ఎన్నికలలో ఊహించని విధంగా నాలుగు స్థానాలలో విజయం సాధించిన బిజెపి కి కూడా తెలంగాణ పై ఆశలు పుట్టాయి. సిఎం కేసీ ఆర్ మజ్లీస్ పార్టీతో అంటకాగుతుండటం బిజెపి వరంగా మారింది. ఆ సాకు చూపించి తెలంగాణలో పెరిగేందుకు ప్రయత్నం చేస్తున్నది. తప్పులేదు. ఎవరి రాజకీయ వ్యూహం వారికి ఉంటుంది. అయితే బిజెపి నేడో రేపో తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తున్నది అన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారం సోషల్ మీడియా కన్నా కూడా ఎక్కువగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో జరుగుతున్నది. బిజెపిలో చేరికలను పెద్దవి చేసి చూపిస్తున్న మీడియా ను నమ్ముకుంటే బిజెపికి నిరాశ తప్పదనిపిస్తున్నది. ఎందుకంటే బిజెపి తెలంగాణలో మరింత కష్టపడితేనే ఫలితాలు వస్తాయనేది వాస్తవం. పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి నాలుగు సీట్లు రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. బిజెపి గెలిచిన నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో అసలు ఆ పార్టీకి నిర్మాణమే లేదు (ఎన్నికల నాటికి) కరీంనగర్, ఆదిలాబాద్ లలో బిజెపికి కొంత బలం ఉండేది. అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి అభ్యర్ధులు ఈ రెండు పార్లమెంటు స్థానాలలో బాగా కష్టపడ్డారు. ఆ లాంచ్ ప్యాడ్ పార్లమెంటు ఎన్నికలు ఉపకరించింది. కరీంనగర్ లో అయితే బిజెపి కోసం అహర్నిశలూ కష్టపడుతున్నబండి సంజయ్ ఉన్నారు. ఆయన చాలా కాలంగా బిజెపి అభ్యర్ధిగా అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చవి చూస్తూ వచ్చారు. అయినా గ్రౌండ్ వదలకుండా అలానే ఉండిపోయారు. కార్యకర్తలతో మమేకమై ఉంటారు. ఈ మూడు నియోజకవర్గాలలో కూడా బిజెపికి కాంగ్రెస్ సహకారం లభించింది. కాంగ్రెస్ పార్టీ ఎటూ గెలవదని అర్ధమైపోయి ఆఖరు నిమిషంలో కాంగ్రెస్ కు ఓటు వేయాలనుకున్న వారంతా బిజెపికి వేశారు. దానికి తోడు టి ఆర్ ఎస్ లో అంతర్గత పోరాటం కూడా బిజెపికి కలిసివచ్చింది. ఈ నేపథ్యంలో బిజెపి దీర్ఘకాలిక వ్యూహంతో తెలంగాణ లో బలం పుంజుకోవాలని చూసింది. అయితే మీడియాలోని ఒక వర్గం బిజెపిని ఆకాశానికి ఎత్తడం మొదలు పెట్టిన నాటి నుంచి బిజెపి వారు కూడా రెచ్చిపోతున్నారు. గ్రౌండ్ లెవెల్ లో బలపడాల్సిన అవసరాన్ని మీడియా గుర్తు చేయదు. వారంతట వారే తెలుసుకోవాలి. పత్రికల్లో వచ్చే వార్తలను చూసుకుని మురిసిపోతే బిజెపికి ఆశాభంగం కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ బిజెపిలో చేరిన వారిని పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావు నుంచి నిన్న పార్టీలో చేరిన వారి వరకూ ప్రభావశీలమైన నాయకులు ఎవరూ లేరనే చెప్పాలి. అందుకే టి ఆర్ ఎస్ పార్టీ బిజెపికి పెద్దగా భయపడుతున్న దాఖలాలు లేవు. పైగా బిజెపిలో చేరుతున్న వారంతా స్పెంట్ ఫోర్సు -అని మంత్రి తలసాని ఇప్పటికే వ్యాఖ్యానించారు. టి ఆర్ ఎస్ నుంచి కూడా భారీ వలసలు ఉంటాయని బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జె పి నడ్డా అంటున్నారు కానీ ఆ ఛాయలు కనిపించడం లేదు. జె పి నడ్డా కన్నా ముందు నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఈ విషయం చెబుతున్నారు కానీ ఇప్పటి వరకూ అయితే అలా జరగలేదు. బిజెపి సంస్థాగతంగా బలపడేందుకు ఇప్పటి నుంచి చర్యలు తీసుకోగలిగితే వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ వాస్తు బలం మెరుగుపడవచ్చు. (జెపి నడ్డా చెప్పినట్లు).

Related posts

మంత్రుల పర్యటన కు విస్తృత ఏర్పాట్లు

Bhavani

నాగర్ కర్నూల్ జిల్లాలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి

Satyam NEWS

ఆచార్య జయశంకర్ కు నివాళి అర్పించిన గుత్తా, చిరుమర్తి

Satyam NEWS

Leave a Comment