39.2 C
Hyderabad
April 25, 2024 16: 50 PM
Slider కృష్ణ

సాగు నీటి వినియోగంపై రాజకీయాలకు స్వస్తి పలకాలి

#somuveeraju

రాష్ట్రంలో నీటి వనరులను ఉపయోగించుకుని నదుల అనుసంధానంతో వివాదం లేని భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులను నిర్మించాలనేది భారతీయ జనతా పార్టీ సంకల్పంగా భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నీటి ప్రాజెక్టులు – వనరులు- సవాళ్లు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం గాంధీనగర్ లోని హెూటల్ ఐలాపురం కన్వెన్షన్ సెంటర్లో సోమవారం జరిగింది. ఉత్తరాంధ్ర, కోస్తా, మధ్యాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఇరిగేషన్ శాఖలో పనిచేసిన సీనియర్ ఇంజనీర్లు, నిపుణులు, విద్యాధికులు, ఉద్యమకారులు, భాజపా నాయకులు సదస్సులో పాల్గొన్నారు. సదస్సు పూర్తయ్యాక సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.

నీటి వినియోగంపై పార్టీలు రాజకీయాలకు స్వస్తిపలికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మేలు జరిగేలా సమగ్ర ఆలోచన చేయాలని కోరారు. రాష్ట్రంలోని నీటివనరులతో వివాదం లేని ప్రాజెక్టులు మాత్రమే నిర్మించాలని కోరారు. ఈ రోజు జరిగిన సదస్సు ఉద్దేశ్యం, నెరవేరేలా జరిగినందుకు సంతృప్తిని వ్యక్తంచేశారు. ముఖ్యంగా నదీ యాజమాన్యాల బోర్డుల నోటిఫికేషన్లో పేర్కొన్న కొన్ని అంశాలపై నిపుణులు వెలిబుచ్చిన అభ్యంతరాలపై 21న వర్ట్యువల్ సమావేశం నిర్వహించి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు నివేదిక ఇస్తామన్నారు. అలాగే నీటి వనరులపై సమగ్ర అధ్యయనం చేసి ఒక వర్కింగ్ గ్రూపు ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలో మరో సదస్సును త్వరలో నిర్వహించనున్నట్లు చెప్పారు.

ప్రాజెక్టులన్నీ గోదావరి, కృష్ణానదీ యాజమాన్యాల బోర్డుల పరిధిలోకి వచ్చేలా నోటిఫికేషన్ ఇవ్వడంతో అంతరాష్ట్ర జలవివాదాలను చెక్ పెట్టినట్లయిందన్నారు. దీని వల్ల రాయలసీమ, మధ్యాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ నోటిఫికేషన్తో కృష్ణా, గోదావరి నీరు పక్క పొరుగురాష్ట్రాల చేతిలో జలదోపిడికి గురికాకుండా రాయలసీమ, ఎపిని రక్షిస్తుందని భరోసా ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో జరుగుతున్న అంతరాష్ట్ర జలవివాదాలకు ఆపేందుకు ప్రాజెక్టులన్నిటినీ నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తీసుకురావడమే ఉత్తమ పరిష్కార మార్గంగా కనిపిస్తోందన్నారు.పోలవరం నిర్వాసితులు త్యాగధనులని, వారిని విస్మరించడం క్షమార్హం కాదన్నారు. తమ సర్వసాన్ని వదలుకుని భూమిని ఇచ్చేసిన నిర్వాసితులు ఈ రోజు గోదావరి వరద కారణంగా తాగునీరు, కరెంటు వంటి మౌలికసదుపాయాలు లేని ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారని, వారిని తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ ఆర్ ప్యాకేజీని -ప్రాజెక్టుతో సమానంగా పూర్తిచేయాలని అన్నారు.

పోలవరం నిర్మాణం 78 శాతం పూర్తయిందని ప్రకటించిన ప్రభుత్వం కేంద్రం నిధులివ్వడంలేదని ఆరోపించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. హంద్రీ- నీవా, వెలుగొండ, తెలుగుగంగ, వంశధార, తోటపల్లి, నాగావళి, బహుదా వంటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా కడుతూ, కేవలం పోలవరం గురించే మాట్లాడటం సరికాదన్నారు. ఆ ప్రాజెక్టులపై ఎందుకు సమీక్ష చేయడం లేదని నిలదీశారు.

సదస్సులో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ యు. నారాయణరాజు మాట్లాడుతూ, సుదీర్ఘకాలం తెలంగాణ వారికి నీటిపారుదలశాఖ మంత్రి పదువులు ఇవ్వడంతో ఎపీ నష్టపోయిందన్నారు. పోలవరం నీరు వస్తేనే విశాఖకు నీటి వసతి లభిస్తుందన్నారు. క్యాచ్మెంట్ ఏరియా నీటిని దామాషా పద్ధతిలో పంచుకోవడం అంతర్జాతీయ ప్రమాణాల్లో లేదన్నారు. కాని తెలంగాణ ప్రభుత్వం తమకు లేని క్యాచ్మెంట్ ఏరియాను ప్రస్తావించి నీటిని వాడుకోచూస్తుందన్నారు.

ఎస్ఆర్కిర్ ఇంజనీరింగ్ కళాశాల ఉపన్యాసకులు ప్రొఫెసర్ రామకృష్ణంరాజు మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి నదుల పరీవాహప్రాంతాలున్న రాష్ట్రాలను బోర్డుల పరిధిలో కలపాలని సూచించారు.

రాయలసీమ నీటి సాధనా సమతి అధ్యక్షులు దశరధరామిరెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రాయలసీమకు 69 జీవో కారణంగా నీరు దక్కకుండా పోయిందన్నారు. బోర్డుల్లో ప్రాజెక్టులను కలపడంతో రాయలసీమకు మేలు జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

భూగర్భ జల నిపుణులు ధరణికోట వెంకటరమణ మాట్లాడుతూ, పంపకాలలో అన్యాయం జరగడం వల్ల తాగడానికి వీలుకాని నీరు మనకు లభిస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 854 అడుగుల ఎత్తు ఉండేలా చేస్తేనే రాయలసీమకు మనుగడ ఉంటుందన్నారు. రిజర్వాయర్ లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎలా ఉ పయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తుంగభద్ర జలాలతోనే రాయలసీమ కరవు తీరుతుందన్నారు. కదిరికి చెందిన హరనాధరెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రరాష్ట్ర విభజన సమయంలో సిద్ధేశ్వరం ప్రాజెక్టును మద్రాసు వారు ఇస్తాంటే దానిని వదిలేసి త్యాగం చేసినందుకు నాగార్జునసాగర్ నిర్మించి నీటిని తెలంగాణకు తరలించారని వాపోయారు.

భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు అధికారం కోసం కాకుండా నీటి కోసం కష్టపడితే నీటి సమస్య తీరేదన్నారు. నదుల అనుసంధానంతోనే రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

సదస్సులో ప్రసంగించిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ యు. నారాయణరాజు, ప్రొఫెసర్ రామకృష్ణంరాజు, భూగర్భ జల నిపుణులు ధరణికోట వెంకటరమణ, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు దశరధరామిరెడ్డి లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్ఛార్జి సునిల్ దేవర్, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, కోశాధికారి వామరాజు సత్యమూర్తి, నాయకులు పాకా సత్యనారాయణ, గద్దె బాబూరావు, షేక్ బాజి, శశిభూషన్రెడ్డి, బుచ్చిబాబు, పాతూరి నాగభూషణం, నాగోతు రమేష్ నాయుడు, లంకా దినకర్, నిషితరెడ్డి, పూడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సోషల్‌ మీడియాలో అవాస్తవ సందేశాలు పంపితే చర్యలు

Satyam NEWS

అధికార పార్టీ నేత బంధువట రోడ్డును ఆక్రమించేస్తున్నాడు

Satyam NEWS

పాదయాత్రలో ఇచ్చిన హామీ గుర్తు లేదా ముఖ్యమంత్రి గారూ?

Satyam NEWS

Leave a Comment