ఈఎస్ఐ మందుల కుంభకోణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా దర్యాప్తు జరుపుతూ నిందితులను అరెస్టు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదు. పేద కార్మికులకు అందాల్సిన వైద్య సాయాన్ని వారికి దూరం చేసిన దుర్మార్గులను పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది.
నామమాత్రపు దర్యాప్తుతో ఎందుకో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఐదు సంవత్సరాలుగా ఈఎస్ఐ కార్పొరేషన్ ను దోచుకుతిన్న పెద్దమనుషులను ఇప్పటి వరకూ చట్టానికి పట్టిఇవ్వకపోవడం ఎందుకో అర్ధం కావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా కేసు దర్యాప్తు చేసి మందుల కంపెనీలు, మందుల షాపుల వారు, ప్రభుత్వంలో పని చేస్తున్న సిబ్బంది అనే లెక్క లేకుండా ఇప్పటికి 16 మందిని అరెస్టు చేసింది.
సాక్ష్యాత్తూ కార్మిక శాఖ మాజీ మంత్రి, సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు అయిన ఒకరి అల్లుడు ఈ కేసులో ఉన్నారని సాక్ష్యాధారాలు వచ్చినా వేరే విషయాలు ఆలోచించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కేసు దర్యాప్తు విషయంలో ముందుకే వెళుతున్నారు.
పూర్తి సాక్ష్యాధారాలు లభ్యం అయితే ఆ పెద్దమనిషి అల్లుడిని కూడా అరెస్టు చేయండని ముఖ్యమంత్రి ఏసీబీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసిందే. ఈ కారణంగానే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఈఎస్ఐ మందుల కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం చేసింది. విచిత్రం ఏమిటంటే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ చేసిన దర్యాప్తు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో అరెస్టులను చాలా సులభంగా చేయవచ్చు.
ఎలాంటి ప్రత్యేక దర్యాప్తు కూడా అవసరం లేదు. తెలంగాణ ఏసీబీ అన్ని వివరాలను ఇప్పటికే సేకరించింది. ఇవే కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో కూడా కుంభకోణానికి పాల్పడ్డాయి. తెలంగాణ ఏసీబీ అరెస్టు చేసిన నిందితులను మరింతగా ప్రశ్నిస్తే మరి కొన్నివిషయాలు సులభంగా బయటపడతాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం విచారణకు ఆదేశాలిచ్చి చోద్యం చూస్తూ కూర్చున్నది. ఇద్దరు మాజీ మంత్రులు, ఒక ఐఏఎస్ అధికారి, మరొక బడా బాబు ఈ కుంభకోణంలో పట్టుబడే అవకాశం ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది