స్వచ్ఛ తెలంగాణ పేరుతో అవార్డులు ఇచ్చే కేంద్ర పెద్దలు ఒక్కసారి బిచ్కంద బస్టాడ్ చూస్తే ఇప్పటి వరకూ ఇచ్చిన అవార్దులన్నీ వాపసు గుంజేసుకుంటారు. జుక్కల్ నియోజకవర్గానికి కేంద్ర బిందువైన బిచ్కుంద బస్టాండ్లో సమస్యలు తిష్టవేశాయి. మురుగుదొడ్లు నిండిపోవడంతో బస్టాండ్ ప్రాంతం దుర్గంధం వెదజల్లుతున్నది. దానికి తోడు త్రాగునీరు అసలు లేవు. ఇక మరుగుదొడ్ల విషయాన్ని కొస్తే మహా దారుణం. నూతనంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఎంతో కొంత మొన్నటి వరకు ఉపయోగంలో ఉన్న మరుగుదొడ్లను మూసివేశారు. దీంతో పరిస్థితి పరాకాష్టగా మారింది. మహిళా ప్రయాణికుల పరిస్థితి మరింత దారుణం. పురుషులు ఎక్కడైనా వెళ్తారు కానీ మహిళలు సంగతి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో వ్యాపార సముదాయాల నుండి లక్షలాది రూపాయలు ఆదాయం సమకూరుతున్నప్పటికీ బస్టాండ్ ప్రాంతంలో సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపెడుతున్నారు. ఈ బస్టాండ్ నుండి ప్రతి రోజు వేలాదిగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అటు కర్నాటక ఇటు మహారాష్ట్ర తెలంగాణ హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ బస్టాండ్ నుండి ప్రయాణం కొనసాగించాల్సి ఉంది. దీంతో తెలంగాణలో బస్టాండ్లు ఇంత దారుణంగా ఉంటాయా అని పలువురు కర్నాటక మహారాష్ట్ర ప్రయాణికులు ప్రభుత్వ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడి మరుగుదొడ్లను త్వరగతిన నిర్మాణం చేపట్టి త్రాగునీరు లాంటి ఎన్నో మౌలిక సౌకర్యాలను కల్పించి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని బిచ్కుంద మండల వాసులు కోరుతున్నారు.