అమరావతిలో మరోసారి భూసమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఐదువేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు నిర్నయించారని, దానికోసం భూమి అవసరం ఉందన్నారు. అయితే ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారనే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి చెప్పారు. రాజధానిలోని అనంతవరంలో గ్రావెల్ క్వారీలను మంత్రి నారాయణ పరిశీలించారు.
ఆ తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి త్వరలో మెగాసిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో సీఎం ఉన్నారని మంత్రి తెలిపారు. అందుకే అంతర్జాతీయ స్థాయి విమనాశ్రయం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా భూములు తీసుకుంటే కేవలం రిజిస్ట్రేషన్ ధరలో రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, అలా కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ ను కోరుకుంటున్నారని అన్నారు. భూసమీకరణ ద్వారా ఎయిర్ పోర్ట్ కోసం ముప్పై వేల ఎకరాలు సమీకరించాల్సి ఉంటుందన్నారు.
వీటిలో రైతులకు రిటర్నబుట్ ప్లాట్లు ఇవ్వగా మిగిలిన భూముల్లో రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతుల కోసం మరికొన్ని వేల ఎకరాలు అవసరం ఉంటుందన్నారు. ఇవన్నీ పోగా ఇంకా ఐదువేల ఎకరాలు మాత్రమే మిగులుతుందన్నారు. అందుకే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎక్కువ భూమి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ విషయంలో భూసమీకరణ లేదా భూసేకరణ అనేది ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసారు. అమరావతి నిర్మాణం కోసం 2015లో కేవలం 58 రోజుల్లోనే రైతులు స్వచ్చందంగా 34 వేల ఎకరాలు భూమిని పూలింగ్ ద్వారా ఇచ్చారనే విషయాన్ని మంత్రి గుర్తు చేసారు.