21.2 C
Hyderabad
December 11, 2024 22: 30 PM
Slider తెలంగాణ

సమ్మె లో లేని వారికి వెంటనే జీతం విడుదల

KCR Facebook new_0

మూడు రోజుల్లో వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని, ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరపదని సిఎం స్పష్టం చేశారు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సిఎం ప్రకటించారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వర్తిస్తున్న వారికి సంబంధించిన సెప్టెంబర్ మాసం జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. 50 శాతం ఆర్టీసీ బస్సులు నడపడానికి అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని, 30 శాతం బస్సులను అద్దె ప్రాతిపదికన, 20 శాతం ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్ అధికారులు సునిల్ శర్మ, నర్సింగ్ రావు, సందీప్ సుల్తానియా, ట్రాన్స్ పోర్టు జాయింట్ కమిషనర్లు పాండురంగ నాయక్, సి.రమేశ్, మమతా ప్రసాద్, డిటిసిలు ప్రవీణ్ రావు, పాపారావు, ఆర్టీసీ ఇ.డి.లు టివి రావు, యాదగిరి, వినోద్, వెంకటేశ్వర్లు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘‘ఆర్టీసీలో వందకు వందశాతం బస్సులను పునరుద్ధరించాలి. దీనికోసం అసవరమైన సిబ్బందిని వెంటనే తీసుకోవాలి. రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలి. బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం కలిగిన వారిని పనిలోకి తీసుకోవాలి. అధికారులు రేయింబవళ్లు పనిచేసి, మూడు రోజుల్లో వందకు వంద శాతం బస్సులు నడిచేలా చూడాలి’’ అని సిఎం ఆదేశించారు. ‘‘ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఆర్టీసీలో 50 శాతం (5,200) సంస్థ సొంత బస్సులు నడపాలి. ఇందుకు అవసరమైన సిబ్బదిని వెంటనే నియమించాలి. 30 శాతం(3,100) అద్దె బస్సులు నడపాలి. ఇందులో ఇప్పటికే 21 శాతం ఉన్నాయి. మరో 9 శాతం బస్సుల కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. 20 శాతం(2,100) ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిషన్లు ఇవ్వాలి. దీనికోసం అవసరమైన కసరత్తు చేయాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘‘యూనియన్ నాయకుల పిచ్చిమాటలు నమ్మి కార్మికులు అనధికారికంగా గైర్హాజరయి తమంతట తామే ఉద్యోగాలు వదులుకున్నారు. అంతే తప్ప ఎవరినీ ఎవరు డిస్మిస్ చేయలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి లాగారు. యూనియన్ నాయకులు అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించి 48 వేల మంది ఉద్యోగాలు పోయేలా చేశారు. విధులకు హాజరుకాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశమే లేదు. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదు, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఆర్టీసీని నష్ట పరిచిన కార్మికులను క్షమించే ప్రసక్తే లేదు. అసలు వారు చేస్తున్నది సమ్మె కానే కాదు. అది చట్ట విరుద్ధమైన ప్రజలకు అసౌకర్యం కల్పించే చర్య మాత్రమే. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. విధులకు హాజరైన ఉద్యోగులు, కార్మికుల సెప్టెంబర్ నెల జీతం వెంటనే విడుదల చేస్తాం’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు

Related posts

టెడ్మా ది సేవియర్ ఆఫ్ డిజిటల్ ఇండస్ట్రీ

Satyam NEWS

వైభవంగా తీజ్ పండుగ వేడుకలు

Satyam NEWS

ఘనంగా బాసరలో వసంత పంచమి వేడుక

Satyam NEWS

Leave a Comment