రోజు రోజకు చెలరేగుతున్న అసమ్మతిని కట్టడి చేయడానికి పదవుల పంపిణీ ఒక్కటే శరణ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం ఆయన కసరత్తు మొదలు పెట్టినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పదవుల పంపిణీ ఇప్పటి వరకూ జరగలేదు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
టిఆర్ఎస్ లో పదవుల కోసం ఏర్పడిన పోటీ దృష్ట్యా కమిటీలు,నామినేషన్ పదవుల నియామకాలకు ప్రాధాన్యం ఏర్పడింది. పదవుల్లేకుండా 103మంది శాసనసభ, మండలి సభ్యులు ఉన్నారు. మొత్తం టిఆర్ఎస్ కు 137మంది సభ్యులున్నారు. వీరిలో సీఎం కాకుండా 17మందికి మంత్రి పదవులు ఉన్నాయి. మండలి ఛైర్మన్, ఉప ఛైర్మన్, శాసనసభాపతి, ఉపసభాపతి, ఇద్దరు చీఫ్ విప్లు, సభలో ఆరుగురు, మండలిలో నలుగురు చొప్పున విప్లు ఉన్నారు. మొత్తంగా 34 మందికి పదవులు లభించాయి.
ఇంకా 103 మంది మిగిలి ఉన్నారు. కొంతమందికి కార్పొరేషన్ల ఛైర్మన్ పదవిపై ఆసక్తి ఉంది. 19మందికి కమిటీల ఛైర్మన్లుగా అవకాశం ఇవ్వనున్నారు. పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ ( పీఏసీ) ఛైర్మన్ పదవిని సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికి ఇవ్వాలి. ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేదు. టిఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ రెండో అతిపెద్ద పార్టీగా ఉంది.
ఆ పార్టీకి మొదటి వరసలోని విపక్ష స్థానం కేటాయించారు. తాజాగా పీఏసీ ఛైర్మన్ పదవిని ఆ పార్టీకి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మజ్లిస్ నుంచి ఈ మేరకు వినతి వచ్చింది. ఈ అంశంపై సీఎం మూడు, నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గుమ్మడి శ్రీనివాస్