26.2 C
Hyderabad
February 14, 2025 00: 36 AM
Slider ప్రత్యేకం

సంతృప్తిపరచని నామినేటెడ్ పోస్టులు

#chandrababu

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నామినేటెడ్‌ పోస్టులను రిటైర్డ్‌ ఐపిఎస్ అధికారులకు కేటాయించారు. వైకాపా హయంలో తీవ్ర వేధింపులకు గురైన ఎబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా నియమించగా, మ‌రో రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఆర్‌.పి. ఠాకూర్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఈ రెండు పోస్టుల భర్తీపై టిడిపిలోనూ, ఈ పోస్టులకు నియమింపబడిన వారిలోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ‘ఏబీ’ విషయంలో ఆయనకు ఇచ్చిన పోస్టు ఆయనను అవమానించేందుకేననే అభిప్రాయాలు ఆయన అభిమానుల నుంచి వస్తున్నాయి.

గత ఐదేళ్ల ‘జగన్‌’ పాలనలో ‘ఏబీ’ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టిడిపి ప్రభుత్వం ఓడిపోయిన దగ్గర నుంచి మొన్నటి ఎన్నికలు జరిగే వరకు..అయిదేళ్లపాటు ఆయనకు ఎటువంటి పోస్టింగ్‌ ఇవ్వకుండా ‘జగన్‌’ ప్రభుత్వం వేధించింది. ‘జగన్‌’ ప్రమాణస్వీకారం చేసిన మొదటిరోజే ‘ఏబీ’పై సస్పెన్షన్‌ వేటు పడిరది. ఆ తరువాత ఆయనపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి ప్రయత్నించారు. ‘జగన్‌’ ఎంత వేధించినా..ఆయన తొణకలేదు..బెణకలేదు. ‘జగన్‌’కు లొంగకుండా, వెన్నుచూపకుండా ఐదేళ్లపాటు పోరాడారు.

ఒక కక్ష కట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని సంవత్సరాలు పోరాడడం..సామాన్యమైన విషయం కాదు. అయితే..‘ఏబీ’ వాటిని తట్టుకుని ఐదేళ్లపాటు వీరోచితంగా పోరాడారు. ఆయన పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు, ఆయన అభిమానులు పలువిధాలుగా కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు మంచి ప్రాధాన్యత ఇస్తారని, ‘చంద్రబాబు’ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనను పోలీసుశాఖకు సంబంధించిన కీలకమైన పదవిలో కూర్చోబెడతారని ఆశించారు. అయితే అదేమీ జరగలేదు.

ఎనిమిది నెలల తరువాత ఆయనను ప్రాధాన్యత లేని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించడంపై ఆయనతో పాటు, ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టు ఇచ్చి ఆయనను అవమానించారని, ఇంతకన్నా ఆయనకు ఏమీ ఇవ్వకుండా పోయేదని, ఆయనకు అవమానాలు తప్పేవని వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఠాకూర్‌కు సలహాపదవి ఇవ్వడంపై కూడా క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

రాష్ట్రానికి చెందిన వారిని కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని సలహాదారుగా పెట్టుకోవడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. సలహాదారు పోస్టులకు రాష్ట్రంలో ఎవరూ దొరకలేదా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో కూర్చుని పార్టీ అభ్యర్థుల విజయానికి, ఇతర విధాలుగా సహకరించారని, అందుకే ఆయనకు ఆ పోస్టు ఇచ్చారని అధికారవర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద రెండు నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేస్తే రెండిటిపై అభ్యంతరాలు, విమర్శలు రావడం గమనార్హం.

Related posts

ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ :’అలిపిరికి అల్లంత దూరంలో”

Satyam NEWS

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

Satyam NEWS

అక్రమ సంబంధం పర్యవసానంగా వివాహితపై విచక్షణారహిత దాడి

Satyam NEWS

Leave a Comment