సీనియర్ పాత్రికేయుడు, రచయిత, వ్యాఖ్యాత నాగనబోయిన నాగేశ్వరరావు జాతీయ స్థాయిలో పదవి దక్కించుకున్నారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) ఉపాధ్యక్షునిగా నాగేశ్వరరావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గతంలో ఎన్ యు జె ఉపాధ్యక్షునిగా నాగేశ్వరరావు విశేషమైన సేవలను అందించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్ యు జె బలోపేతానికి, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ఆయన విశేష కృషి చేశారు. నాగేశ్వరరావు చేసిన సేవలకుగాను సభ్యులందరూ సంపూర్ణ మద్దతు తెలియజేసి వేరెవరూ ఉపాధ్యక్ష పదవికి నామినేషన్ వేయలేదు.
దీంతో ఎన్.ఎన్.ఆర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. నగరానికి చెందిన ఎన్ ఎన్ ఆర్ జాతీయస్థాయిలో రెండవసారి కీలక పదవిని దక్కించుకోవడం పట్ల పలువురు పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నాగేశ్వరరావు మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
సభ్యులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని ఎన్ యు జె ఉపాధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన ఎన్ .ఎన్.ఆర్ తెలిపారు. పాత్రికేయ హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సుమారు మూడు దశాబ్దాలుగా ఎన్ ఎన్ ఆర్ పాత్రికేయ రంగంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
పాత్రికేయునిగా, సాహస క్రీడాకారునిగా, రచయితగా ఎన్ ఎన్ ఆర్ సుప్రసిద్ధులు. క్రీడా జర్నలిస్టుగా అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు పై పత్రికలకు ప్రత్యేక వ్యాసాలు రాయడం తో పాటు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి రేడియో నివేదికలు అందించారు.
మోటార్ సైకిల్ పై భారత యాత్రను చేపట్టి రహదారి భద్రత పై ప్రజల్లో అవగాహన కలిగించారు. ఈ అనుభవాలతో కలల రహదారి పుస్తకాన్ని రచించారు. ఉత్తరాంధ్ర పర్యటన అనుభవాలతో “ఉత్తరాంధ్ర కన్నీళ్లు”, “ఉత్తరాంధ్ర విలాపం” పుస్తకాలను రచించారు.
ఉత్తరాంధ్ర నీటి వనరుల వినియోగంపై రచించిన ఉత్తరాంధ్ర కన్నీళ్లు పుస్తకం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఉత్తరాంధ్ర కన్నీళ్లు హిందీ అనువాదం ‘ఉత్తరాంధ్ర కే అసు’ పుస్తకాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆవిష్కరించారు.