తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత తీసుకున్న చర్యలపై చంద్రబాబు నేడు టీటీడీ భవనంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ బీ ఆర్ నాయుడు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కె.పార్ధసారధి, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, టీటీడీ కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు తదితరులు కూడా పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఎం తెలిపారు. డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా పనిచేశారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని సస్పెండ్ చేస్తున్నాం. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తున్నాం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. టీటీడీపై జరిగిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం… నేను చెప్పిన వాటిని టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు… అసమర్ధత, అనాలోచిత నిర్ణయాల వల్ల పవిత్రతకు భంగం కలగకూడదు.. రాజకీయాలకు అతీతంగా శ్రీవారికి సేవ చేస్తున్నాం అనే భావన ఉండాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.