ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకెత్తించిన రూ. 300 కోట్ల ఈఎస్ఐ మందుల కుంభకోణం లో దర్యాప్తులో భాగంగా బుధవారం విజయవాడలోని డైరెక్టరేట్ కార్యాలయంలో కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి ఉదయాలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. అంతే కాకుండా కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది కాలం కిందట ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. మందుల కొనుగోళ్లలో ఏకంగా వందల కోట్లలో అక్రమాలు జరిగినట్లు బయటపడింది. మందులు సరఫరా చేయకుండానే కోట్లు కొట్టేసేందుకు కొందరు ప్రణాళికలు రచించారు. ఏకంగా 300 కోట్ల మందులు, వైద్య సామాగ్రి కొనుగోళ్లపై అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిన కార్మికశాఖ విచారణకు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే సమయంలో ఈఎస్ఐలో మెడిసిన్స్ కొనుగోలులో భారీ కుంభకోణం బట్టబయలైంది. మందులు, వైద్యపరికరాల కొనుగోలులో ఎలాంటి నిబంధనలు పాటించకుండా అధికర ధరలకు మందులు కొనుగోలు చేసి సుమారు రూ.200 కోట్లు కుంభకోణానికి తెరతీశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణియే సూత్రధారి అని నిర్ధారణ అయింది. అర్హతలు లేని ఏజెన్సీల నుంచి మందులు కొనుగోలు చేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారు.
previous post
next post