37.2 C
Hyderabad
April 19, 2024 13: 35 PM
Slider ప్రత్యేకం

కొత్త పేరుతో వస్తున్న పాత కారు

brsfresh

కేసీఆర్ అన్నంత పనీ చేశారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) పేరుతో సరికొత్త జాతీయ పార్టీని స్థాపించారు. ఇక టీఆర్ఎస్ అనే మాట ఉండదని ప్రకటించారు. ఈ కొత్త పార్టీ స్థాపనతో, కొత్త రూపంలో, కొత్త పేరుతో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ జాతీయ స్థాయి పార్టీగా విస్తరించిందనే భావనను విశదపరిచారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ సంస్థగా ప్రారంభమై, తర్వాత రాజకీయ పార్టీగా అవతరించి వరుసగా రెండుసార్లు అధికారం పొందిన పార్టీలో తెలంగాణ పదం కనుమరుగుకావడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ భావోద్వేగం ఎక్కడికి వెళ్లిపోయింది? అని ప్రశ్నించేవారు ఉన్నారు. తెలంగాణ అస్థిత్వం ఇక నుంచి దేశవ్యాప్తం కానుందని నమ్మేవారూ,సంతోషించేవారు కూడా ఉన్నారు. జాతీయ పార్టీ స్థాపన, జాతీయ రాజకీయాల్లో కెసీఆర్ ప్రభావంపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోగలిగిన శక్తి లేదా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు తెచ్చుకొనే స్థాయి ప్రస్తుతానికి బీఆర్ఎస్ కు లేదనే వినపడుతోంది.

ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెంది వరుస పరాజయాలను మూటకట్టుకుంటున్న నేపథ్యంలో బలమైన ప్రతిపక్షం అవసరమని చాలామంది గుర్తించారు. శూన్యం ఉందనే అంశాన్ని అందరూ విశ్వసిస్తున్నారు. కెసీఆర్ జాతీయ పార్టీని స్థాపించడం వెనకాల ఉన్న ముఖ్య కారణాల్లో ఇది ఒకటని భావించాలి. కుమారుడు కెటీఆర్ ను ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కూర్చోపెట్టి, జాతీయ రాజకీయ యవనికపై తాను విహరించాలని కెసీఆర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆ ముహూర్తం ఇదిగో ఇప్పుడు వచ్చినట్లు అనుకోవాలి.సార్వత్రిక ఎన్నికలు 2024లో జరుగనున్నాయి.

ఈ లోపు 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. మరి కొన్ని రోజుల్లో మునుగోడులో జరుగబోయే ఉపఎన్నికలో గెలుపును దక్కించుకోవడం కూడా కీలకం.2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఇంకా కీలకం.ఈ ఫలితాలు బీఆర్ఎస్ భవిష్యత్తుపైనా పనిచేస్తాయి. తెలంగాణలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బిజెపి ఇదిఒరకటి కంటే పుంజుకుంటోంది.

ఈ ప్రభావాన్ని అడ్డుకోవడం కెసీఆర్ కు చాలా ముఖ్యం. ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన సున్నితమైన,కీలకమైన సందర్భంలో కెసీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ ను స్థాపించిన దరిమిలా మాట్లాడుతూ కేసీఆర్ ముందుగా తన యాత్ర కర్ణాటక, మహారాష్ట్రతో మొదలవుతుందంటున్నారు. కర్ణాటకలో కుమారస్వామి, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే వంటివారు, మరికొన్ని చిన్న పార్టీలు తనతో నడుస్తాయనే విశ్వాసం ఆయనలో కనిపిస్తోంది. పార్టీ ఆవిష్కరణ కార్యక్రమానికి కుమారస్వామి హాజరై ఆ భావనకు బలాన్నిచ్చారు.

ఉద్ధవ్ థాక్రే,స్టాలిన్,మమతా బెనర్జీ మొదలైన విపక్షనాయకులు కారణాలు ఏవైనా… ఈ వేడుకకు హాజరు కాలేదు. మరో అగ్రనేత శరద్ పవార్ కూడా రాలేదు. కాంగ్రెస్,బిజెపి లేని పక్షాన్ని తయారుచేయడమే తన లక్ష్యమని కేసీఆర్ పదే పదే అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలంతా కాంగ్రెస్ లేని ప్రతిపక్షం బలంగా ఉండదని నమ్ముతున్నారు. ఆ అభిప్రాయాన్ని బలంగా చెబుతున్నారు కూడా.

కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపు వస్తే….

ఒక్క మమతా బెనర్జీ మాత్రం అటుఇటు ఊగుతున్నారు. నితీశ్ కుమార్ కూడా కాంగ్రెస్ భాగస్వామ్యాన్ని బలపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ తో వీరంతా ఏ మేరకు  నడుస్తారనే సందేహాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ క్రమంగా ఊపందుకుంటోంది. సోనియా గాంధీ,రాహుల్ గాంధీ కలిసి కర్ణాటకలో తాజాగా చేసిన యాత్రకు మంచి స్పందనే వచ్చింది. ఒకవేళ కాంగ్రెస్ ఊపందుకుంటే? ఆ పార్టీతో కలిసి నడవడానికి కూడా కేసీఆర్ వెనకాడరనీ అంచనా వేయవచ్చు.

గత చరిత్రను గమనిస్తే ఆ విషయం బోధపడుతుంది. దళితబంధు మొదలైన దళిత జనహిత పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతో పేరు తెచ్చాయని,ఈ పథకాలను జాతీయ స్థాయిలో విస్తరించాలని, తెలంగాణ ప్రభుత్వ మోడల్ దేశం మొత్తానికి ఆదర్శమని కేసీఆర్ నమ్ముతున్నారు. దేశ ప్రజలందరినీ నమ్మించగలననే విశ్వాసం కూడా ఆయనలో కనిపిస్తోంది.

అదే సమయంలో బిజెపి/ మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని, అది తమకు కలిసొస్తుందనే నమ్మకం కూడా ఆయనలో ఉంది. కారణాలు ఏవైనా నరేంద్రమోదీ – కే చంద్రశేఖర్ రావు మధ్య గ్యాప్ పెరిగిందని అనుకోవాలి. రైతు సంఘాలు కూడా తనతో నడుస్తాయని కేసీఆర్ అనుకుంటున్నారు. దేశ ఆర్ధిక,సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం నరేంద్రమోదీ నాయకత్వంలోని బిజెపి బలంగానే ఉంది.

అదే సమయంలో, ఎక్కువ ప్రతిపక్షాలు మోదీపై వ్యతిరేకంగానే ఉన్నాయి. ఆయనను ఎలాగైనా గద్దె దింపాలని,లేకపోతే తమకు భవిష్యత్తు ఉండదనే భయంతో కూడా ఉన్నాయి. వీరంతా ఏకమయ్యే క్రమంలో బీఆర్ఎస్ ను కూడా కలుపు కోవడం వల్ల ఆ పార్టీకి కొంత గుర్తింపు వస్తుందని అంచనా వెయ్యాలి. దక్షిణాది వారిని, అందునా తెలుగు నాయకులను ఉత్తరాది ప్రజలు ఏ మేరకు స్వాగతం పలుకుతారన్నది అనుమానమే.

ఎంత మోదీ వ్యక్తిరేకత ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలన్నీ ఏ మేరకు ఏకమవుతాయో ఇప్పుడే చెప్పలేం. 2024 సార్వత్రిక ఎన్నికల లోపు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. ఇందులోని జయాపజయాలు అన్ని పార్టీల భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపిస్తాయి.ఈ అంశం అధికార బిజెపికి కూడా వర్తిస్తుంది. ఎన్టీఆర్ వంటి నాయకుడు కూడా ‘భారతదేశం’ పేరుతో పార్టీ పెట్టాలని ఆలోచన చేసి,విరమించుకున్నారు.

చంద్రబాబునాయుడు ‘తెలుగుదేశం’ను జాతీయ పార్టీగా అభివర్ణించినా,ఆచరణలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కే పరిమితమై పోయారు. అమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మాత్రం వివిధ రాష్ట్రాల్లో విస్తరించడానికి కుస్తీపడుతున్నారు. ఈ ఆటలో దిల్లీకి జతగా పంజాబ్ లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. జాతీయ పార్టీని స్థాపించబోయే ముందు కేసీఆర్ పెద్ద కసరత్తులే చేశారు. బీఆర్ఎస్ గురించి ఇప్పుడే ఎక్కువ మాట్లాడడం భావ్యం కాదు. కాస్త ఆగుదాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

టెంపుల్ తీఫ్: దేవుడినే దోచేస్తున్న దొంగల అరెస్టు

Satyam NEWS

హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతి…!

Satyam NEWS

రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల మానవహారం

Satyam NEWS

Leave a Comment