27.3 C
Hyderabad
August 5, 2021 13: 05 PM
Slider సంపాదకీయం

ఇప్పటికి బుద్ధి మార్చుకోలేని తెలంగాణ వృద్ధ కాంగ్రెస్ నేతలు

#telangana congress

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తుంటే ఏమని తిట్టాలో కూడా అర్ధం కావడం లేదు. తెలంగాణ లోని 119 నియోజకవర్గాలలో ఇంకా 20 నుంచి 25 శాతం ఓటు బ్యాంకు ఇంకా ఆ పార్టీకి ఉంది. ఎవరో తెలియని వ్యక్తిని నిలబెట్టినా కూడా 20 శాతం ఓట్లు గ్యారెంటీ అన్నమాట.

అటువంటి పార్టీని ఒక చైతన్యవంతమైన, కేసీఆర్ పై రాజీలేని పోరాటం చేసే వ్యక్తి నడిపిస్తే చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు 30 నుంచి 38 శాతానికి పెరిగే అవకాశం ఉంటుంది. నాయకుడు గట్టివాడు కాకపోయినా, కేసీఆర్ తో కుమ్మక్కయ్యాడని తెలిసినా కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు కూడా చీలిపోయే ప్రమాదం ఉంది.

అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? కేసీఆర్ తో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాని వ్యక్తిని పిసిసి అధ్యక్షుడుగా పెట్టుకోవాలి. అలా చేద్దాం అని రాహుల్ గాంధీనో, సోనియాగాంధీనో అనుకున్న ప్రతిసారీ వృద్ధ నాయకులు తెరపైకి వస్తారు. ఈ వృద్ధనాయకులు అందరూ ఉండగానే కదా కాంగ్రెస్ పార్టీ దారుణంగా రెండు మూడు సార్లు ఓడిపోయింది? అంటే ఈ వృద్ధ నాయకులపై ప్రజలకు నమ్మకం లేనట్లే కదా?

మరి ఇంకా ఈ వృద్ధ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక వృద్ధ నాయకుడు స్వయంగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాడు. సీనియర్ నాయకుల పేరుతో ఈ వృద్ధులపై అసహ్యంతోనే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సాంప్రదాయ ఓటర్లు వేరే దారి చూసుకుంటున్నారు.

అసహ్యకరమైన రాజకీయాలు చేసే ఈ వృద్ధ కాంగ్రెస్ నాయకులు బతికి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంతే అనే అభిప్రాయం బలంగా వ్యాపించి ఉన్నది. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఉండాలనేది ఈనాటిది కాదు. గత అసెంబ్లీ ఎన్నికల నాడే రేవంత్  రెడ్డి పిసిసి అధ్యక్షపదవి ఆశించారు.

అయితే కొత్తగా వచ్చిన వారికి పార్టీ అధ్యక్షపదవి ఇవ్వలేరని, పార్టీ కోసం పని చేస్తే ఆ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల నాటికి పిసిసి పదవి పొందవచ్చునని పెద్దలు సూచించారు. దాంతో రేవంత్ రెడ్డి వేరే రాజకీయాలు చేయకుండా పార్టీ కోసం పని చేస్తున్నారు. జిల్లాల్లో తన మనుషులను పెట్టుకుంటున్నాడనేది పెద్ద ఆరోపణ.

నిజమే.

కొత్త వారు రాకుండా పార్టీ విస్తరించలేదు కదా? రేవంత్ రెడ్డిని చూసి కొత్త వారు పార్టీలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వృద్ధ నాయకులను చూసి కాంగ్రెస్ పార్టీలోకి ఎవడూ రాడు. ‘‘కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పిసిసి అధ్యక్షపదవి ఇవ్వవద్దు’’ అంటూ ఈ వృద్ధులు ఇప్పుడు కొత్త పల్లవి మొదలు పెట్టారు.

ఒక విధంగా చెప్పాలంటే పాత పల్లవినే మళ్లీ కొత్త రాగంలాగా వినిపిస్తున్నారు. రేవంత్ రెడ్డిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రెడ్లు విశేష కృషి చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇస్తే పార్టీని వదిలి వెళతామని గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి బహిరంగంగానే చెప్పారు.

రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి వద్దని చాలా మంది అంటున్నారు… అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దూతను పంపి అభిప్రాయ సేకరణ జరిపింది. 31 జిల్లాల అధ్యక్షులలో మెజారిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిసిసి అయితే నే పార్టీ బతుకుతుందని అధిష్టానం దూతకు చెప్పారు.

ఇప్పుడు ఆ అభిప్రాయ సేకరణ చేసిన ఏఐసిసి నాయకుడిని కూడా ఈ వృద్ధ నాయకులు విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయి ఆయనకు అనుకూలంగా నివేదిక ఇచ్చాడని బహిరంగంగా చెబుతున్నారు.

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ముందు పిసిసి అధ్యక్షుడి మార్పు వద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంతో దాన్ని అధిష్టానం వాయిదా వేసింది. నాగార్జున సాగర్ లో జానారెడ్డి గెలిస్తే ఆయనకే పిసిసి ఇవ్వాలని డిమాండ్ చేద్దామనేది నల్గొండ రెడ్ల ఎత్తుగడ.

అయితే పాపం ఆ వృద్ధ నాయకుడు ఎన్నికల్లో ఓడిపోయాడు.

ఇప్పుడు మళ్లీ పాత పాట మొదలు పెట్టారు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తమకే ప్రాధాన్యత ఇవ్వాలి అని. పార్టీలో యువ నేతలు చాలా మంది ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంటి వాళ్లు నిజాయితీగా పోరాటం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డిని వీరితో కలిపి యువ టీమ్ ఏర్పాటు చేస్తే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ బతికేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో లాగా 2 శాతం ఓట్లకు పడిపోతుంది. దాన్ని ఈ వృద్ధులు, చేవలేని నేతలు అడ్డుకోలేరు.

కాటికి కాళ్లు చాపి ఉన్న ఈ నాయకుల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదు. ఇప్పటికైనా అధిష్టానం తెగించి ఒక నిర్ణయం తీసుకోకపోతే… ఇక హస్తం గుర్తును తెలంగాణలో మర్చిపోవచ్చు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, www.satyamnews.net

Related posts

110 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

Sub Editor

గో గ్రీన్: మిషన్ మోడ్ లో మొక్కలు నాటే కార్యక్రమం

Satyam NEWS

తృటిలో తప్పించుకున్న టాప్ మావోయిస్టులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!