32.7 C
Hyderabad
March 29, 2024 12: 38 PM
Slider ప్రత్యేకం

‘అవధానానికి ఒకరోజు’.. ఏమైందో ?

#Dharmana Prasada Rao

అవధానానికి ఒకరోజును అంకితం చేసి,సరికొత్త సత్ సంప్రదాయాన్ని నెలకొల్పి,భాషాభిమానాన్నిచాటుకుంటామని మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట ఇచ్చి 5 నెలలు దాటిపోయింది.పోయిన సంవత్సరం డిసెంబర్ 18 వ తేదీన శ్రీకాకుళంలో జరిగిన అవధాన వేదికపై,ఎందరో అవధాన కవుల సాక్షిగా ఇది జరిగింది.

ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు.తెలుగువారి సంతకంగా భావించే ఉత్కృష్ణ సాహిత్య ప్రక్రియ ‘అవధానం’.తెలుగువారి ఆస్తిగా పేరుమోసిన పద్యం మూలంగా, సర్వంగా సాగే ఈ సారస్వత క్రతువు సర్వ సౌందర్య శోభితం.

వందల ఏళ్ళ ఘన చరిత కలిగిన ఈ ప్రక్రియకు సాహిత్య సమాజంలో గొప్ప గౌరవం ఉన్నదన్నది వాస్తవం. కానీ,ప్రభుత్వాలలో విస్మరించబడిన కళాప్రక్రియగానే భావించాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల

ఇద్దరు అవధానకవులకు ‘పద్మశ్రీ’ పురస్కారం సమర్పించి గౌరవించింది.అది తెలుగువారికి ఆనందాన్నిచ్చే అంశమే. ఐతే! ఆ పురస్కారం పొందిన ఆశావాది ప్రకాశరావు, గరికిపాటి నరసింహారావు అందుకున్నది కేవలం అవధాన ప్రక్రియకు చేసిన సేవ, చూపిన ప్రతిభకు కాదు.

సాహిత్య సేవా విభాగంలో మాత్రమే వారికి ఆ గుర్తింపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి,ఉత్తరాదివారికి తెలుగువారి అవధాన విద్యా విశిష్టత గురించి పెద్దగా తెలిసిఉండదు.అది నిజం కూడా. ప్రధానమంత్రిగా పనిచేసిన మన పీవీ నరసింహారావును

వారిలో మినహాయించి చూడాలి. వారి పాలనా కాలంలోనైనా అవధానానికి కేంద్ర ప్రభుత్వంలో గుర్తింపు రాలేదా అంటే? అప్పుడున్న దేశ పరిస్థితులు వేరు.

మాడుగుల నాగఫణిశర్మ హైదరాబాద్ లో చేసిన అవధాన ప్రదర్శనకు ప్రధానమంత్రి హోదాలో ముఖ్య అతిధిగా వచ్చి తన భాషాభిమానాన్ని, పద్యానురక్తిని,అవధాన ప్రక్రియ పట్ల తన అభినివేశాన్ని, అభివ్యక్తిని పీవీ నరసింహారావు

హృదయపూర్వకంగా చాటుకున్నారు. మరో సమయంలో మేడసాని మోహన్ నిర్వహించిన అవధానంలోనూ పాల్గొని పీవీ
తన భాషానురక్తిని చూపించారు. ఇక ఎన్టీఆర్,బెజవాడ గోపాలరెడ్డి వంటి వారు సరే సరే!

వారు ఉఛ్వాస నిశ్వాసలలో తెలుగుతనాన్ని నింపుకొని సాగారు. అవధాన రంగంలో,కొప్పరపు కవుల కుమారులను బెజవాడ గోపాలరెడ్డి ఎంతగానో ప్రోత్సహించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

టంగుటూరు ప్రకాశంపంతులు, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి నాయకులు అవధానానికి చూపిన గౌరవం అంతాఇంతాకాదు. ఐతే! ఇన్నేళ్ల పాలనా వ్యవస్థల్లో,

కేంద్రంలో ఏ పార్టీ,ఏ నాయకుడు అధికారంలో ఉన్నా! అవధానానికి ‘పద్మపురస్కారం’ ప్రకటించిన సందర్భం ఇంతవరకూ లేదు.

కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా అవధానానికి ప్రత్యేక పురస్కారం స్థాపించి ఉండాల్సింది. అదీ జరుగలేదు.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం అవధాన విద్యా వికాసం కోసం మాడుగుల నాగఫణిశర్మకు హైదరాబాద్ లో పెద్ద స్థలాన్ని

కేటాయించింది. అది మంచి విషయమే. ఈ విషయంలో చంద్రబాబు,వై ఎస్ రాజశేఖరరెడ్డి ఇద్దరూ ముందు నిలిచారు. ఆ తర్వాత అవధాన విద్యా వికాసం దిశగా ప్రభుత్వాల నుంచి అడుగులు పడిన దాఖలాలు లేవు. ఆంధ్రవిశ్వవిద్యాలయం

వైస్ ఛాన్సలర్ గా జీఎస్ఎన్ రాజు ఉన్న సమయంలో అవధాన విద్య కోసం విశ్వవిద్యాలయంలో ప్రత్యేకమైన విభాగాన్ని ప్రారంభించారు.అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. వారి పదవీ కాలం ముగిసాక ఆ విభాగం అటకెక్కింది.

తర్వాత వచ్చిన వైస్ ఛాన్సలర్స్ ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు. బహుశా! వారికి ఎవరైనా గుర్తు చేశారో లేదో కూడా తెలియదు. అలా అవధాన ప్రాశస్త్యానికి ప్రభుత్వాలలో గుర్తింపు కనుమరుగైంది. గత డిసెంబర్ 18 వ తేదీ శ్రీకాకుళంలో

లలితాదిత్య అవధాన సభకు ముఖ్య అతిధిగా మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. తన ప్రసంగంలో భాగంగా గొప్ప ప్రకటన చేశారు. ఇక నుంచి ప్రతి ఫిబ్రవరి 22 వ తేదీని ‘ప్రపంచ అవధాన దినోత్సవం’గా చూస్తాం అన్నారు. వేదికపై వున్న కవిపండితుల ప్రతిపాదనకు ప్రతిస్పందనగామంత్రి ధర్మాన ఈ ప్రకటన చేశారు.

వారు కేబినెట్ మంత్రి కాబట్టి దానిని ప్రభుత్వ ప్రకటనగానే చూడాలి. నిజానికి వారి మంత్రిత్వ శాఖ అది కాకపోయినా, అవధానంపై ఉండే అభిమానంతో ఈ ప్రకటన చేసినందుకు ధర్మాన ప్రసాదరావుకు అభినందనలు వెల్లువెత్తాయి.భాషా

సాంస్కృతిక శాఖకు ఆర్ కె రోజా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అంశాన్ని ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వం

దృష్టికి,సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్ళారో లేదో తెలియదు.

ఆ దిశగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ జీవోగానీ, ఎటువంటి ప్రకటన కానీ వెలువడలేదు.మంత్రిగారు చేసిన ప్రకటనకు సత్వరమే ఆమోదముద్ర లభిస్తుందని అందరం ఎంతగానో ఆశించాం. ‘అవధాన దినోత్సవం’గా

ఫిబ్రవరి 22 ను ఎంచుకోడానికి ఒక చారిత్రక కారణం,ఔచిత్యం కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫిబ్రవరి దాటి జూన్ లోకి కూడా అడుగుపెట్టాం. ఈ తరుణంలో ఫిబ్రవరి 22 ప్రాశస్త్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం.

1872 ఫిబ్రవరి22న కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో శ్రీమాన్ మాడభూషి వేంకటాచార్యులవారు తొలి అవధానం చేసినరోజు.

అందుకని ఈ రోజును ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చారునిజంగా ఇది చాలా మంచి ఆలోచన.నిజానికి తెలుగునాట అవధాన విద్య ప్రారంభమై వందల ఏళ్ళు అయ్యింది.చరిగొండ ధర్మన, కోలాచాల మల్లినాథసూరి, రామరాజభూషణుడు మొదలైనవారి కాలంలోనే

అవధాన కళ అద్భుతంగా వికసించింది.ఆధునిక కాలంలో సరిగ్గా 150 ఏళ్ళ క్రితం గుంటూరుకు చెందిన
మాడభూషి వెంకటాచార్యులు అవధాన విద్యకు కొత్త సిలబస్ ను తయారుచేసి,వారే ప్రదర్శించి సాహిత్యలోకానికి

అందించారు. దాన్ని అందిపుచ్చుకొని తిరుపతి వెంకటకవులు, కొప్పరపు కవులు అవధాన సాహిత్య సామ్రాజ్యంలో విజృంభించారు.

ఈ రెండు జంటలకు తోడు మరికొందరు కవులు కలిసి అవధాన విద్యకు సుస్థిరమైన పునాదులు వేశారు.ఈ ప్రక్రియకు బంగారుబాటలు వేసి, పద్యరత్నాలు పండించిన వారిలో తిరుపతి వెంకటకవులు, కొప్పరపు కవుల స్థానం అమేయం,

అపూర్వం.ఇంతటి అవధానకళను రేపటి తరాలకు అద్భుతంగా అందించడం జాతి కర్తవ్యం. ఇప్పటికీ మాడుగుల నాగఫణిశర్మ, మేడసాని మోహన్, గరికిపాటి నరసింహారావు, వద్దిపర్తి పద్మాకర్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ వంటివారు

అద్భుత రీతిన అవధాన ప్రక్రియకు విశేష ఖ్యాతిని కలిగిస్తున్నారు. బులుసు అపర్ణ, లలితాదిత్య వంటి యువతరం అవధాన యాత్ర చేస్తున్నారు. అది సరిపోదు.అవధాన విద్యకు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక విభాగాలను స్థాపించాలి.

నెల్లూరులోని తెలుగు ప్రాచీన హోదా కేంద్రంలోనూ ప్రత్యేక శాఖను ఏర్పాటుచేయాలి. దూళిపాళ మహాదేవమణి, కడిమళ్ళ వరప్రసాద్ వంటివారు వ్యక్తిగత స్థాయిలో అవధానులను తయారు చేస్తున్నారు. నేటి ప్రసిద్ధ,ప్రతిభావంతులైన

అవధానులందరినీ అవధాన విద్యా వికాసం కోసం కొత్త తరాలకు తర్ఫీదు ఇచ్చేలా సద్వినియోగం చేసుకోవాలి.అవధానకళకు ప్రతి ఏటా ఒక పద్మపురస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి.

ఆ దిశగా మన తెలుగు నాయకులు, ప్రభుత్వాలు కృషి చేయాలి. రెండు తెలుగు ప్రభుత్వాలు అవధాన విద్యకు ప్రతి సంవత్సరం ప్రత్యేక పురస్కారం అందించాలి.

అంతటి అవధానానికి వెలుగులు ప్రసరించిన తిరుపతి వెంకటకవులు, కొప్పరపు కవుల వంటి మహనీయుల జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా నిర్వహించాలి.

అవధాన మహాకవుల విశేషాలు, అవధాన విద్యా విశిష్టతలను పాఠాల్లో పెట్టాలి.ఇలాంటివి ఎన్నో చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, నడిపే పాలకులది.

గుర్తు చేయాల్సిన కర్తవ్యం అందరిదీ.ధర్మాన ప్రసాదరావు మంచి తెలుగు మాట్లాడుతారు.పాలనలో,రాజకీయాల ఒత్తిళ్లలో బహుశా! మంత్రిగారు మర్చిపోయి వుంటే? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడైనా ప్రకటించి, త్వరలో

ఆచరణలో పెడితే? మంత్రిగారితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చరిత్రలో గొప్ప ఖ్యాతి మిగులుతుంది.ఈ దిశగా ముందుకు సాగుతారని ఆశిద్దాం.

మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్

Related posts

నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థకే మాయని మచ్చ

Satyam NEWS

రేపు కేటీఆర్, రేవంత్ రెడ్డి రాక: హాట్ హాట్ గా కామారెడ్డి రాజకీయాలు

Satyam NEWS

రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీవో ధర్మ చంద్రా రెడ్డి

Satyam NEWS

Leave a Comment