ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రస్తావించినా కూడా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలలో పెద్ద గా ప్రభావం చూపినట్లుగా కనిపించడం లేదు. లోక్ సభ ఎన్నికలలో అప్రతిహత విజయాన్ని సాధించిన భారతీయ జనతా పార్టీ ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తటబాటు ప్రదర్శించింది. దేశ భక్తి అంశం ప్రతి సారీ పని చేయదనని, అందులోనూ రాష్ట్రాల ఎన్నికలలో పని చేయదని మరొక్క మారు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.
ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కచ్చితంగా ప్రధాని నరేంద్రమోడీ పాలనకు రెఫరెండం కాదు కానీ బిజెపి తాను తీసుకుంటున్న నిర్ణయాలపై పునరాలోచించుకోవాల్సిన అవసరాన్ని మాత్రం సూచిస్తున్నాయి. రాష్ట్రాలలో గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన విధంగానే రాజకీయాలు చేస్తే ప్రజలు సహించబోరనే వాస్తవాన్ని కూడా ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన బాగా పుంజుకోవడం బిజెపి జీర్ణించుచోలేని విషయం. గత ఐదు సంవత్సరాలలో శివసేనను కట్టడి చేసేందుకు బిజెపి చేయని ప్రయత్నం లేదు. అన్ని రకాలుగా శివసేనను అడ్డుకున్నా కూడా ఆఖరు నిమిషంలో అదే పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది.
అంతే కాకుండా ఇప్పుడు ఆ పార్టీ బాగా పుంజుకోవడం బిజెపికి రాబోయే రోజుల్లో సమస్యలు తెచ్చిపెడుతుందనడంలో సందేహంలేదు. గత ఎన్నికలలో గణనీయమైన ఓట్లు సీట్లు సాధించిన విదర్భ ప్రాంతంలో ఈ సారి రెండు పార్టీలూ తగిన సీట్లు పొందకపోవడం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. విదర్భ ప్రాంతం నితిన్ గడ్కరి సొంత ప్రాంతం. ఆయన ను పార్టీ చిన్న చూపు చూడటం ఈ ప్రాంతంలో ప్రభావం చూపి ఉంటుంది. అంతే కాకుండా ఈ ప్రాంత సమస్యలను గత ఐదేళ్లలో బిజెపి పట్టించుకోలేదు. ఇది కూడా ప్రభావం చూపింది. పాలనా తీరు మహారాష్ట్ర పై ప్రభావం చూపినట్లే హర్యానాలో కూడా కనిపించింది. బిజెపి జాతీయ నాయకత్వం ఉన్నంత చురుకుగా హర్యానాలో బిజెపి రాష్ట్ర నాయకత్వం లేదు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనంగా ఉన్నా భూపేంద్ర సింగ్ హూడా నేతృత్వంలో కాంగ్రెస్ స్థానిక నాయకత్వం ఎంతో బలంగా ఉంది. అందుకే అక్కడ కాంగ్రెస్ పని తీరు మెగురుపడింది. కాంగ్రెస్ పార్టీలో కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్న రాహుల్ గాంధీకి ఇది మింగుడు పడే విషయం కాదు. సోనియాగాంధీ మళ్లీ పాత నాయకత్వాన్ని తెరపైకి తీసుకువచ్చి మంచి ఫలితాలు సాధించింది. అందువల్ల రాహుల్ గాంధీకి ఈ నిర్ణయం ఈ ఫలితాలు శుభ సూచకం కాదు. రాహుల్ గాంధీ తీసుకువచ్చిన అశోక్ తివారి ఎన్నికల ముందు కాడి పడేయగా భూపేంద్ర సింగ్ హూడా ఆ బాధ్యతను స్వీకరించి మంచి ఫలితాన్ని రాబట్టారు. జాతీయ ఎన్నికలకు రాష్ట్రాల ఎన్నికలకు ఓటర్ల తీర్పు వేరు వేరుగా ఉంటుందని ఈ ఫలితాలు చెబుతున్నాయి.