
ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట లోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం రాత్రి అంకురార్పణ నిర్వహించారు. ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు జరుగనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం 6 నుండి అర్చకుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశం ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ చేశారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.