39.2 C
Hyderabad
March 29, 2024 15: 33 PM
Slider ప్రత్యేకం

ఓపీనియన్: నిషేధించాల్సిన యాప్ లు ఇంకా ఉన్నాయి

#Apps Banned in India

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా వేళ్ళూనుకున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల విస్తృతి బహుముఖాలుగా విస్తరించింది. భావవ్యక్తీకరణకు స్వీయ నియంత్రణ లోపించడంతో వెర్రితనం హద్దులుమీరుతోంది. సమాజశ్రేయస్సు త్రోసిరాజని సాగుతున్న వ్యాపారదృక్పథం దేశదేశాలకు వ్యాపించి ప్రాంతం, వయస్సు, లింగభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను ప్రభావితంచేయడం  ఆశ్చర్యం.

వ్యర్ధ విషయాలను, నిరుపయోగ అంశాలను  మనిషి మెదడులోనికి చొప్పించి తీవ్ర కలవరపాటుకు గురిచేసే రీతిగా సామాజిక మాధ్యమాలు పెచ్చరిల్లుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వీటికి అదనంగా వినోదం పేరుతో ప్రపంచానికి  పరిచయమైన టిక్ టాక్, పబ్జీ ఆటలు, హెలో,యూసీ బ్రౌజర్ వంటి యాప్ లు జన బాహుళ్యంలోకి తామరతంపరగా చొచ్చుకొచ్చాయి.

వత్తిడి నుంచి రిలీవ్ కావడానికి బానిసలుగా మారుతున్నారు

నిత్యజీవితంలో ఎదురయ్యే ఒత్తిడినుంచి ఉపశమనం పొందే ఉద్దేశ్యంతో మొదలైన పలురకాల యాప్ ల వినియోగం క్రమంగా వ్యసనంగా మారడం గమనార్హం. మానసిక శాస్త్రవేత్తల పరిశీలన ప్రకారం కొన్ని యాప్ లు విచ్చలవిడి వినియోగం కారణంగా మనిషిలో నేరప్రవృత్తి పెరిగి  కుటుంబానికి, సమాజానికి భారమయ్యే ప్రమాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

సామాన్యులనుంచి ప్రముఖుల వరకు ఈ తరహా యాప్స్ కు బానిసకావడం విడ్డూరం. కొన్ని కార్యాలయాలలో, పరిశ్రమలలో ఈ ప్రమాదకరమైన యాప్ ల వినియోగం వలన లక్షించిన ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు రుజువైంది. ప్రమాదకరమైన యాప్ లు బహిష్కరించాలనే వాదన మేథావి వర్గాలలో, సామాజిక శాస్త్ర నిపుణులలో  బలంగానే వినిపిస్తున్నా ఆయాదేశాలకు.. యాప్ ల హక్కుదారులు, పంపిణీ వ్యవస్థలతో ముడిపడిన వ్యాపార, వాణిజ్య పరమైన ఆర్ధిక  లావాదేవీలు  నిర్ణయం తీసుకోవడానికి అడ్డుగా నిలిచాయి.

చైనా కుయుక్తులకు భారత్ చెక్

తాజాగా చైనాతో రాజుకున్న  యుద్ధవాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం 59 మొబైల్ అప్లికేషన్స్ వినియోగంపై నిషేధం విధించింది. వాటిలో దాదాపు అన్ని యాప్ లు చైనాకు చెందినవి కావడంతో భారత్ నిర్ణయం చైనా కుయుక్తులకు చెక్ పెట్టినట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఐటీ చట్టంలోని సెక్షన్ 69 ఏ, ఐటీ నిబంధనలు -2009 అనుసరించి భారత్ కు భద్రతా పరంగా పొంచి ఉన్న ముప్పు ఆధారంగా 59 యాప్స్ నిషేధించినట్లు ప్రభుత్వం వివరించింది. దేశ సార్వభౌమత్వానికి, భారతీయుల గోప్యతకు హాని కలిగించే మొబైల్ అప్లికేషన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలనుంచి ఎంతోకాలంగా ఫిర్యాదులు వస్తున్నా ప్రభుత్వం స్పందించలేదు.

నిషేధించాల్సిన యాప్ లు ఇంకా ఉన్నాయి

సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను ఆర్ధికంగా నూ దెబ్బతీయాలనే లక్ష్యం తో భారత్ పావులు కదిపింది. యాప్ ల వినియోగం కారణంగా చైనా రూ.వేల కోట్లు ఆదాయం ఆర్జిస్తోంది. ఇప్పుడు నిషేధం విధించడంతో ఆయా కంపెనీల ఆదాయం గణనీయంగా పడిపోవడం ఖాయం. భారతీయ మార్కెట్ లో సింహభాగం ఆక్రమించిన చైనా కు చెందిన యాప్ లు తీవ్ర నష్టానికి గురికాగలవని తెలుస్తోంది.

గతంలో అత్యున్నత న్యాయస్థానం… జనజీవనాన్ని దుష్ప్రభావం పాల్చేస్తున్న మొబైల్ యాప్ ల నిషేధం విషయంలో యోచించాలని ప్రభుత్వానికి సూచించినా స్పందించలేదని సామాజిక శాస్త్రవేత్తలు విమర్శించారు. ఐతే….చైనాతో అమలులో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక పరమైన, దౌత్యపరమైన అంశాలు యాప్ ల నియంత్రణను మరుగుపర్చాయి.

ఉక్కిరి బిక్కిరి అవుతున్న చైనా కంపెనీలు

తాజాగా భారత్ యాప్స్ పై నిషేధం విధించడంతో చైనా ఉక్కిరిబిక్కిరవుతోంది. అంతే కాదు…. అంతర్జాతీయ నిబంధనలు, స్థానిక చట్టాలకు అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగించాలని, పెట్టుబడిదారుల చట్టబద్ధ హక్కులను భారత్ గౌరవించాలని హెచ్చరిస్తోంది. గూగుల్ ప్లేస్టోర్,యాపిల్ ప్లే స్టోర్ నుంచి తమ యాప్ ను టిక్ టాక్ సంస్థ తొలగించడం గమనార్హం.

ఇదిలా ఉండగా…. పబ్జీ (PUBG), జూమ్ యాప్స్ పై నిషేధం విధించకపోవడానికి కారణమేమిటన్నది చర్చకు వస్తోంది. పబ్జీ చైనాకు చెందిన వ్యవస్థ కాదు. దక్షిణ కొరియాకు చెందిన  బ్లూ హూ లె అధీనంలో నడుస్తున్న స్వతంత్ర యాప్ గా దీనిని నిర్ధారించారు. కేవలం మార్కెటింగ్  కోసమే చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  అందువల్లే నిషేధం విధించలేదా?

యాప్ లతో కాలక్షేపం సరే నష్టం మాటేమిటి?

అలా అయితే ఆ యాప్ వల్ల కలుగుతున్న నష్టం మాటఏమిటి? ఇండియా, చైనా, నేపాల్, ఇరాక్ దేశాలలో పబ్జీ ఆటకు మిలియన్లలో ప్రజాదరణ ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే…. విద్యార్థులపై తీవ్రం ప్రభావం చూపిస్తున్న ఈ ఆటల వినియోగాన్ని గుజరాత్, తమిళనాడు, జమ్మూకాశ్మీర్ లలో కొంతమేర  నిషేధించారు. చిన్నారుల మనసులలోకి క్రమంగా విషం చొప్పిస్తున్నట్లు విద్యావేత్తలు ఆవేదన వ్యక్తంచేశారు.

జూమ్ యాప్ కు చైనాతో సంబంధం లేదని నిర్వాహకులు తెలిపారు. ఇది పూర్తిగా అమెరికాకు చెందినదని, జూమ్ వ్యవస్థాపకుడు బిలియనీర్ ఎరిక్ యు ఆన్  కంపెనీకి సీ యీ ఓ అని వారు స్పష్టం చేస్తున్నారు. యూఎస్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని..దీనికి సంబంధించిన కార్యనిర్వహణ చైనాతో సహా పలుదేశాలలో విస్తరించినట్లు తెలిపారు.

మేక్ ఇన్ ఇండియా కరెక్టుగా ఉంటే….

ఏది ఏమైనా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగిన సమయంలో తగిన చర్య తీసుకున్నట్లు ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అవకాశంగా భారత్ కు చెందిన కంపెనీలు అవసరాలకు  తగిన ప్రత్యామ్నాయాల ఆవిష్కరణలకు చొరవిచూపాలి.

ప్రభుత్వం “మేక్ ఇన్ ఇండియా” నినాదం వాస్తవ రూపంగా పరిణమించడానికి అనువైన వాతావరణం కల్పించాలి. యువ భారతీయ శాస్త్రవేత్తల మేథాసంపత్తిని గుర్తించి ప్రోత్సహిస్తే దేశీయ యాప్స్ రాణింపుతో భారత్  ప్రపంచ దేశాల సరసన సమున్నతంగా తలెత్తి నిలబడుతుందని ఏలికలు గ్రహించాలి.

పొలమరశెట్టి కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

హైదరాబాదులో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం

Satyam NEWS

బండి ఆరోప‌ణ‌.. జీహెచ్ఎంసీ మేయ‌ర్ ఎన్నిక‌కు ఐదు కోట్లా!!!

Sub Editor

ప్రశాంతంగా పైడితల్లి అమ్మ‌వారి ఉత్సవాలు నిర్వహించాలి…!

Satyam NEWS

1 comment

RAMBABU July 2, 2020 at 11:49 AM

All articles nice published sir

Reply

Leave a Comment