‘‘అర్థరహిత డిమాండ్లతో, చట్ట విరుద్ధంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వడం అనైతికం. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, న్యాయ సమ్మతం కాని కోర్కెలతో సమ్మె చేసే వారికి మద్దతిచ్చే రాజకీయ పక్షాలకు ప్రజల మద్దతు లేదు. అసలు రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదు. రాష్ట్రంలో పరిస్థితి నాదాన్ దుష్మన్ అనే విధంగా ఉంది. రాజకీయ ప్రయోజనం కోసం గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నాయి. వారి ఆశ ఫలించదు. సమ్మెకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రజల నుంచి చీత్కారం తప్పదు. గతంలో అనేక విషయాల్లో తప్పుడు వైఖరి అవలంభించడం వల్లే వారు ప్రజల మద్దతు కోల్పోయారు. ఆర్టీసీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో వేటిని కూడా ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. ప్రజలు ఈ విషయాన్ని గమిస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బిజెపి నాయకులు ఇక్కడ బాగా మాట్లాడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇండియన్ రైల్వేస్ ను ప్రైవేటీకరిస్తున్నది. ఎయిర్ లైన్స్ ను ప్రైవేటీకరించింది. చివరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కూడా ప్రైవేటీకరించింది. రైళ్లను ప్రైవేటీకరిస్తున్నది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోలోనే చెప్పింది. అక్కడి వారి ప్రభుత్వం ఇలా చేస్తుంటే, ఇక్కడి ఆ పార్టీ నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’’ అని కేసీఆర్ అన్నారు.
previous post