37.2 C
Hyderabad
March 29, 2024 19: 55 PM
Slider సంపాదకీయం

క్యాపిటల్ ఇష్యూ: ఆర్డినెన్సు ఇస్తే అభాసుపాలు కాక తప్పదు

secretariat

ఆర్డినెన్సు ద్వారా రాజధాని అమరావతిని తరలించడానికి అవకాశం ఉందా? శాసనసభ ఆమోదం పొంది, కౌన్సిల్ లో వికేంద్రీకరణ, సిఆర్ డిఏ బిల్లు నిలిచిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్సు ద్వారా రాజధానిని తరలించే అవకాశం పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న సమయంలో ఈ ప్రశ్న తలెత్తడం సహజం.

అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆర్డినెన్సు జారీ చేయడం కుదరదు కాబట్టి అసెంబ్లీ, కౌన్సిల్ ను ప్రోరోగ్ (నిరవధికంగా వాయిదా) చేసి ఆర్డినెన్సు జరీ చేసేందుకు ప్రభుత్వం ఉద్యుక్తమౌతున్నట్లు కూడా చెబుతున్నారు. అయితే అసెంబ్లీ, కౌన్సిల్ ను ప్రోరోగ్ చేసినా కూడా ఆర్డినెన్సు జారీ చేసే అవకాశం ఇప్పుడు రాజ్యాంగ పరంగా లేదని న్యాయ నిపుణులు అంటున్నారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన ఏదైనా బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే చట్టం అవుతుంది. రాష్ట్రంలో అయితే అసెంబ్లీ, కౌన్సిల్, జాతీయ స్థాయిలో అయితే లోక్ సభ, రాజ్యసభ. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లును కౌన్సిల్ తిరస్కరిస్తే దాన్ని మరో మారు కౌన్సిల్ కు పంపితే కౌన్సిల్ దాన్ని తప్పని సరిగా ఆమోదించాల్సి ఉంటుంది లేదా ఆమోదించినట్లు భావించవచ్చు. అది ఫైనాన్స్ బిల్లు అయితే పూర్తి అధికారాలు అసెంబ్లీకే ఉంటాయి.

అమరావతి రాజధానికి సంబంధించిన ఈ బిల్లులను తెలుగుదేశం మెజారిటీ ఉన్న కౌన్సిల్ తిరస్కరిస్తుందని, దాన్ని అసెంబ్లీ ద్వారా మళ్లీ పంపి కౌన్సిల్ ఆమోదం పొందినట్లుగా భావించవచ్చునని జగన్ ప్రభుత్వం అంచనా వేసుకున్నది. అయితే ఊహించని విధంగా కౌన్సిల్ ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. బిల్లు తిరస్కరణకు గురి అయితే అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవచ్చు కానీ ఇప్పుడు బిల్లు తిరస్కరణకు గురి కాలేదు.

 పెండింగులో ఉంది. కౌన్సిల్లో పెండింగులో ఉన్న బిల్లుపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోలేదు. సెలక్టు కమిటీ ఏర్పాటు చేసి అది బిల్లు క్లియర్ చేసే వరకూ ఆగాల్సిందే. ఇప్పుడు రెండు సభలూ ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స తీసుకువచ్చే అవకాశం కూడా లేదు. చట్ట సభల పరిశీలనలో ఉన్న అంశాలపై ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకురాలేదు. తెగించి తీసుకువచ్చినా గవర్నర్ సంతకం పెట్టే అవకాశం లేదు.

అసలు ఇలా ఎడాపెడా ఆర్డినెన్సులు తీసుకురావడానికి ప్రభుత్వానికి అధికారం కూడా ఉండదు. ఈ మేరకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. రాష్ట్రంలో సంస్కృత పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి బీహార్ ప్రభుత్వం 1989 లో ఒక చట్టం తీసుకువచ్చింది. అయితే ఆ చట్టం చట్ట సభలను దాటుకుని ముందుకు వెళ్లకపోవడంతో అప్పటి నుంచి ఆర్డినెన్సులు జారీ చేస్తూ వచ్చింది.

1992 వరకూ ప్రతి ఆరు నెలలకు ఒక సారి ఆర్డినెన్సులు జారీ చేస్తూనే వచ్చింది. ఈ కేసు పరిశీలనకు వచ్చినపుడు సుప్రీంకోర్టు ఆర్డినెన్సులపై స్పష్టమైన సూచనలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 కింద పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయడానికి రాష్ట్రపతికి శాసన అధికారాలు ఉంటాయి. అయితే ఈ చట్టం ప్రకారం ఒక ఆర్డినెన్స్ ను లోక్ సభ, రాజ్యసభ ఆమోదించిన 6 నెలల్లోగా ఆమోదించాల్సి ఉంటుంది.

రాష్ట్రాల గవర్నర్లకు కూడా ఇలాంటి అధికారాలే ఉంటాయి. 2017 జనవరి 2న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్, జస్టిస్ మదన్ బి. లోకూర్, ఎస్ ఏ బాబ్డే, ఆదర్శ్ కుమార్ గోయెల్, U.U. లలిత్, D.Y. చంద్రచూడ్, ఎల్. నాగేశ్వరరావులతో కూడిన ఏడుగురు జడ్జిల ధర్మాసనం ఈ కేసులో వాదోపవాదాలు విన్న తర్వాత ఇలా చట్ట సభల అనుమతి లేకుండా ఆర్డినెన్సుల ద్వారా చట్టాలు అమలు చేయడం ప్రజా స్వామ్యాన్ని మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు.

కేవలం రాష్ట్రపతి లేదా గవర్నర్ సంతృప్తి చెందితే సరిపోదని, దాన్ని కూడా న్యాయపరిధిలో విచారించవచ్చునని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వాలు ఇచ్చే ఆర్డినెన్సులపై కేసులను కోర్టులు విచారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అందువల్ల కౌన్సిల్ లో బిల్లులను సెలెక్టు కమిటీ క్లియర్ చేసే వరకూ అమరావతి తరలింపు పై ఆర్డినెన్సు ద్వారా కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. తొందరపడి ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేస్తే అభాసుపాలు కాక తప్పదు.

Related posts

దివాలా: ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నిలిపివేయండి

Satyam NEWS

కరోనా హెల్ప్: సాల్వేషన్ ఆర్మీ చర్చి ఆధ్వర్యంలో పండ్లు, గుడ్లు

Satyam NEWS

గెలుపు ఓటమి లని నిర్ణయించేది మేమే

Satyam NEWS

Leave a Comment