35.2 C
Hyderabad
April 20, 2024 15: 31 PM
Slider ప్రత్యేకం

చెరిగిపోయిన స్వీట్ మెమొరీస్: బడితో నాటి జ్ఞాపకాలే వేరు

#oldstudents

1994-95 సంవత్సరం అది. పక్కనే ఉన్న ప్రైమరీ పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసుకుని ఆరవ తరగతిలోకి అడుగుపెట్టిన ఆ క్షణం.. ఇప్పటికి గుర్తుంది. ఎప్పటికి మర్చిపోలేను కూడా.. ఆరవ తరగతిలో సుమారు 40 మంది విద్యార్థులం అనుకుంటా.. సరిగ్గా గుర్తు లేదు.

నా బాల్యంలో ఐదవ తరగతి నుంచి మాత్రమే ప్రభుత్వ పాఠశాలతో అనుబంధం. ఒకటవ తరగతి(అప్పట్లో శిశు తరగతి అనేవారు. ఇప్పుడు ఎల్.కేజీ, యూకేజీ అంటున్నారు) నుంచి నాల్గవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం(జ్యోత్స్న విద్యాలయం)లోనే సాగింది. ఒకే ఒక్క సంవత్సరం 5 వ తరగతి మాత్రమే ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో చదివాను. జూన్ 13, 1994 నాటి నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం ఇన్నేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంది.

మా బ్యాచ్ ఉన్నప్పుడు మా ఆధ్వర్యంలోనే నాటి సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో జన్మభూమి కార్యక్రమంలో పాఠశాల మొత్తం చెట్లు నాటినం. అప్పుడు ఆ చెట్ల కింద కూర్చుని చదువుకునే అదృష్టం మాకు లేకుండేది. మేము పాఠశాల నుంచి వచ్చిన అనేక సంవత్సరాలకు చెట్లు ఏపుగా పెరిగి ఆహ్లాదంగా తయారయ్యాయి. అప్పుడప్పుడు పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆ చెట్లను చూసి అక్కడ కూర్చుని ఇవి మా హయాంలో నాటిన చెట్లు అని స్నేహితులందరం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే వాళ్ళం.

వీలు కుడిరినప్పుడల్లా పాఠశాలకు వెళ్లి స్నేహితులతో కాసేపు అక్కడ గడిపి వచ్చేవాళ్ళం. యూ షేప్ లో ఉన్న పాఠశాల భవనం కుడివైపు నుంచి ఆరవ తరగతి గది ఉండేది. అక్కడినుంచి వరసగా ఏడు, ఎనిమిది తరగతులు.. మధ్యలో హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయుల గదులు. దానికి అనుకుని ఎడమవైపు 9 వ తరగతి, మూలన పదవ తరగతి గదులు ఉండేవి.

నేడు కూల్చివేతతో కళావిహీనంగా మారిన పాఠశాల

గత మూడేళ్ళుగా పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. వర్షాలకు పాఠశాల పైకప్పులు పెచ్చులూడి కలతప్పింది. దాంతో పక్కనే కొత్త భవనాలు నిర్మించారు. నాడు మేము చదువుకున్న గదుల్లో ఇప్పుడు ఒక్క గదిలో కూడా విద్యాబ్యాసం జరగడం లేదు. అలా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పటినుంచో పూర్వ విద్యార్థులం కలిసి ఎంతోకొంత డబ్బు పొగుచేసి పాఠశాల నిర్మాణం చేపడదామని భావించినా ఎందుకో అది కార్యరూపం దాల్చలేక పోయింది.

ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు నాడు మాకు చదువు చెప్పిన గురువులు వాసుదేవరావు(ప్రధానోపాధ్యాయులు) వెంకట్ గౌడ్(ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు), మధుకర్, ఆంజనేయులు, శంకరయ్య, నర్సయ్య, మధుసూదన్ రావు, కృష్ణమూర్తి, వెంకట రమణ, దత్తయ్య, సంతోష్, నారాయణ ఇప్పటికి మాకు గుర్తున్నారు. ఇందులో కొంతమంది ఉపాధ్యాయులు పరమపదించారు.

ఏపుగా పెరిగిన చెట్ల మధ్య విశాలమైన పాఠశాల భవనం

నాడు పాఠశాలకు వాచ్ మెన్ గా ముత్తయ్య ఉండేవాడు. ఇప్పుడు అందరిని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము చదువుకుని, మాకు జీవితాంతం నెమరేసుకునేలా ఉన్న ఆ పాఠశాల నేడు కనుమరుగైంది. ఈరోజే ఆ పాఠశాలను కూల్చేశారు. ఆ స్థానంలో కొత్త పాఠశాల నిర్మాణానికి మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్ల జ్ఞాపకం. ఒక్కసారిగా పటాపంచలైంది. ఆ పాత భవనంలో వందలాది మంది విద్యార్థులు చదువుకున్నారు. ఎంతోమంది ప్రయోజకులయ్యారు.

నేడు ఆ భవనం జ్ఞాపకల్లోకి చేరిపోయింది. కనుమరుగైంది. అప్పుడప్పుడు మొబైల్ లో చూసుకున్నప్పుడు అకస్మాత్తుగా కనిపిస్తేనే ఇక గుర్తుకు రానుంది. మొన్నటి కోవిడ్ సమయంలో 1998-99 బ్యాచ్ 10 వ తరగతి పూర్వ విద్యార్థులం కలిసి రెండు సంవత్సరాలు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఆ పాఠశాల భవనం స్టేజి మీదనే ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఆ స్టేజి ఇక లేదు.

కొత్త స్టేజి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. అలా గుర్తుండిపోతుంది అంతే. ఆ పాఠశాల భవనంతో మాకున్న అనుబంధం ఐదు సంవత్సరాలు మాత్రమే అయినా అదొక గొప్ప అనుభూతి. అక్కడికి వెళ్లినప్పుడల్లా స్నేహితుల్ని ఎక్కడ కలుద్దాం అని అడిగితే ఉంది కదా మన స్కూల్ అక్కడే అనేవాళ్ళం.

కోవిడ్ సమయంలో సరుకులు పంపిణీ చేస్తూ

ఇప్పుడు ఆ స్కూల్ లేదు. ఇప్పుడు బయట ఏదో ఒకచోటు ఎంచుకోవాలి. పాత భవనం కూల్చేసి కొత్త భవనం నిర్మిస్తున్నందుకు భావి తరాల విద్యార్థులకు మంచి భవనం రాబోతుంది అని ఒకవైపు సంతోషం ఉన్నా.. మేము చదువుకున్న భవనం లేకుండా పోయింది అనే బాధ ఎక్కడో ఒకచోట గుచ్చుకుంటుంది. ఇకపై నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆ నాటి ఫోటోలను చూసుకుంటూ మురిసిపోతాం. ఎప్పటికి మా మనసులో ఆ జ్ఞాపకాలను జీవితాంతం పదిలంగా దాచుకుంటాం.

వడ్ల సురేష్(పూర్వ విద్యార్థి), జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, రెడ్డిపేట(గ్రామం), రామారెడ్డి(మండలం), కామారెడ్డి(జిల్లా)

Related posts

కరోనా మరణాలపై చైనా తప్పుడు లెక్కలు

Satyam NEWS

అమానుషం…దారుణం… ఎలా చెప్పాలి ఈ మూగజీవులు

Satyam NEWS

ముదిరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో 27న సామూహిక నిరాహార దీక్ష

Bhavani

Leave a Comment