తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనులు చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అసెంబ్లీ కమిటీహాలులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయనతో బాటు పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కమీషనర్ అకున్ సబర్వాల్ మార్కెటింగ్, వేర్ హౌసింగ్, మార్క్ ఫెడ్, సహకార తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఏర్పాటుచేయాలని, గన్నీ బ్యాగులు, తేమ పరిశీలన యంత్రాలు సమకూర్చుకోవాలని మంత్రి ఆదేశించారు. ధాన్యం నిల్వకోసం గోదాంలు ముందే సమకూర్చుకోవాలని అందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన అధికారులకు తెలిపారు. వరి, సోయాబీన్, పెసర తదితర అన్ని పంటలు సాగు చేసిన రైతుల వివరాలు, ఉత్పత్తి అంచనా వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారులతో తెప్పించుకోవాలని, పౌరసరఫరాల శాఖకు అవసరమైన టార్పాలిన్లు ఇతర సామాగ్రిని మార్కెటింగ్ శాఖ త్వరిత గతిన అందజేయాలని మంత్రి కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సన్నాహాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్లతో వచ్చే వారంలో సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు. పౌరసరఫరాలు, వ్యవసాయం, సెర్ఫ్, సహకార, మార్కెటింగ్ అధికారులతో రాష్ట్రస్థాయిలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని నిర్ణయించారు.
previous post
next post