ఉత్తరాంద్ర ఆరాధ్య దైవం, పూసపాటి వంశీయుల ఆడపడుచు అయిన శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారు విజయనగరం పెద్ద చెరువులో పడమర దిక్కున విగ్రహం రూపంలో పునర్జన్మ ఎత్తింది. పైడితల్లి అమ్మవారు విజయనగరంలో చదురగుడి, వనం గుడి వద్ద ఆలయాలలో పూజలందుకుంటున్నారు. ఆ అమ్మవారే విజయనగరం తూర్పు కనుమలలో అంటే కొండల అంచున ఆకాశానికి అభిముఖంగా కనిపిస్తున్నారు. అమ్మవారి ఆకారంలో కొండలుండటాన్ని సీనియర్ కెమెరామెన్ కాళ్ల శ్రీనివాసరావు గుర్తించారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా కెమరామెన్ గా వృత్తిలో ఉంటూ ప్రస్తుతం ఓ శాటిలైట్ ఛానల్ కు ఆయన పని చేస్తున్నారు. 2018 లో విజయనగరం తూర్పు కొండలలో తనకు శ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనం అయిందని ఆయన చెబుతున్నారు. ఆ అమ్మ రూపం నింగిలోకి చూస్తున్నట్టుగా తనకు గోచరించిందని ఆయన అన్నారు. ఆ దృశ్యాన్ని కెమారాలో ఆయన బంధించారు. ఆ విధంగా కొండల్లో అమ్మ రూపాన్ని ప్రజల్లోకి తీసుకొనే అవకాశాన్ని ఆ అమ్మే కలిగించిందంటున్నారు. తన కెమారా కళ్లలో బంధించిన అమ్మ ప్రతి రూపాన్ని ఫోటో షాట్ ద్వారా ఫోటో ప్రేమ్ చేయించి విజయనగరం వనంగుడి, చధురుగుడి రెండు ఆలయాలలో పెట్టించారు. ఆ రూపాన్ని నేడు పూసపాటి వారసులు అశోక్ గజపతి రాజు, సునీలా గజపతి రాజు దంపతులకు అందచేశారు. ఆ దంపతులు ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.