39.2 C
Hyderabad
March 28, 2024 15: 38 PM
Slider సంపాదకీయం

మతి తప్పి మాట్లాడుతున్న ఇమ్రాన్

imran_khan_39

జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మతిలేని మాటలే మాట్లాడుతున్నాడు. అతనికి అతని దేశానికి ఎలాంటి సంబంధం లేని కాశ్మీర్ అంశంపై అవాకులు చవాకులు పేలుతూ లేని వివాదాన్ని తెచ్చిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు ఏ సెక్టార్ నుంచి కూడా సరి అయిన స్పందన రావడంలేదు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో నరమేధం జరుగుతున్నదని విచాక్షణా రాహిత వ్యాఖ్య ఒకటి ఇమ్రాన్ ఖాన్ చేశాడు. భారత్ అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ అనుకుంటున్నాడు ఇమ్రాన్. బెలూచిస్తాన్ లో పాకిస్తాన్ సైనికులు చాలా సంవత్సరాలుగా అరాచకం సృష్టిస్తూనే ఉన్నారు. 2011 నుంచి 2017 మధ్య కాలంలో సుమారు 5,211 మంది బెలూచిస్తాన్ పౌరులు కనిపించకుండా పోయారని అహ్మద్ రషీద్ అనే జర్నలిస్టు ఎంతో పరిశోధన చేసి తేల్చాడు. బెలూచిస్తాన్ ప్రాంతంలో 2002 నుంచి 2005 వరకూ నాలుగు వేల మంది బెలూచిస్తాన్ పౌరులను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ ప్రభుత్వమే అధికారికంగా చెప్పింది. పాకిస్తాన్ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి తాము వేరుపడతామని బెలూచిస్తాన్ చాలా సంవత్సరాలుగా గర్జిస్తున్నది. ఆ గొంతు నొక్కేందుకు పాకిస్తాన్ చేయని ప్రయత్నం లేదు. వందలాది బెలూచిస్తానీయులను మట్టుబెట్టింది. శవాలు గుట్టలుగా వేసి పాతిపెట్టింది. అత్యంత కిరాతకంగా పాకిస్తాన్ సైన్యం బెలూచిస్తాన్ పట్ల వ్యవహరిస్తున్నది. ఇవన్నీ పక్కన పెట్టి జమ్మూ కాశ్మీర్ లో భారత ప్రభుత్వం ముస్లింలను  ఊచకోత కోస్తున్నదని ఇమ్రాన్ ఖాన్ గతి తప్పి మాట్లాడుతున్నాడు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు అధికమయ్యాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తాము పాకిస్తాన్ లో ఉండేది లేదని కరాఖండిగా చెబుతున్నారు. నరేంద్రమోడీ ప్రధాని అయిన తొలి ఏడాది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను ఒక సారి వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో భారత్ అందించిన సాయం వారు ఇప్పటికి మరచిపోలేకపోతున్నారు. ఆ తర్వాత భూ కంపం వచ్చిన సమయంలో కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలకు భారత్ ఎంతో ఉదారంగా సాయం అందించింది. వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. భారత్ ఏనాడూ కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడలేదు. అలాంటిది కాశ్మీర్ లోనూ ఆ తర్వాత దేశంలో మొత్తంలోనూ ముస్లింలను భారత ప్రభుత్వం ఊచకోత కోస్తుందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడం అతగాడి కుంచిత మనస్థత్వాన్ని వెల్లడిస్తున్నది తప్ప భారత్ పై ఎవరికి అనుమానం కలగలేదు. కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఒక్క సారిగా మతిపోయిన ఇమ్రాన్ ఖాన్ ఆ నాటి నుంచి తన దేశంలోని మిలిటరీకి సమాధానం చెప్పుకోలేక సతమతం అవుతున్నాడు. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ సైన్యానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సరైన సంయమనం లేదు. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ అనే వాడు ఒక ఆట బొమ్మ. సైన్యం అతడి మాట వినేందుకు సంసిద్ధంగా లేదు. ఈ కారణంతోనే ఇమ్రాన్ ఖాన్ ఏదో ఒకటి చేసి పాకిస్తాన్ ప్రజలను ఆకట్టు కోవాలని అనుకుంటున్నాడు. అందుకే భారత్ పై ఆంక్షలు విధిస్తున్నాడు. భారత్ తో వ్యాపార లావాదేవీలను కట్ చేసిన ఇమ్రాన్ ఖాన్ తొలి సారిగా పప్పులో కాలేశాడు. భారత్ నుంచి వచ్చే నిత్యావసర వస్తువులు రాకపోవడంతో పాకిస్తాన్ లో పౌరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారత్ నుంచి అంతర్జాతీయ ఎగుమతులలో పాకిస్తాన్ వాటా చాలా చిన్నది. అందువల్ల ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయంతో భారత్ లో ఎలాంటి ప్రభావం కనిపించదు కానీ పాకిస్తాన్ ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసుకోవడం కూడా పాకిస్తాన్ కే నష్టం ఎక్కువ. ఇలాంటి అరకొర అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న ఇమ్రాన్ ఖాన్ భారత్ పై అక్కసు తీరక మతి తప్పి మాట్లాడుతున్నాడు. ఆర్టికల్ 370 రద్దు పై పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో పెద్ద ఎత్తున మద్దతు లభించింది. దేశ స్వాతంత్ర్య సమయంలో పాకిస్తాన్ లో చేరేందుకు విముఖత వ్యక్త పరచిన కాశ్మీర్ సమస్యను భారత్ ఇప్పుడు పరిష్కరించిన రీతిలోనే, పాకిస్తాన్ తో ఉండేందుకు చాలా సంవత్సరాలుగా విముఖత వ్యక్తం చేస్తున్న తమ సమస్య కూడా పరిష్కరించాలని బెలూచిస్తాన్ పౌరులు కోరుతున్నారు. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతున్న బెలూచిస్తాన్ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అందించే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టేశక్తి ఇప్పుడు భారత్ కు అంతర్జాతీయ స్థాయిలో దక్కిందని అందుకోసం తమ సమస్య తీర్చేందుకు భారత్ ముందుకు రావాలని బెలూచీలు కోరుతున్నారు. 2014లో బెలూచిస్తాన్ ప్రవాస నాయకులు సంఘటితంగా భారత్ వచ్చి కాంగ్రెస్ నేతృత్వంలోని యుపి ఏ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. తమకు స్వాతంత్రం సంపాదించే దిశగా కృషి చేయాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరారు. అయితే యుపిఏ ప్రభుత్వం వారి డిమాండ్ ను తిరస్కరించింది. తాము సాయం చేయలేమని చెప్పింది. ముస్లింలతో తమకు పేచీ వస్తుందని అందువల్ల తాము ఈ విషయంలో జోక్యం చేసుకోమని బెలూచిస్తాన్ నాయకులకు స్పష్టం చేసింది. కాశ్మీర్ పై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న నరేంద్రమోడీ వారిలో ఇప్పుడు కొత్త ఆశలు రేకెత్తించారు. అందుకోసం వారు మళ్లీ భారత్ ను అదే కోరిక కోరుతున్నారు. బహుశ మోడీ కనుక వారి కోరికను మన్నిస్తే పాకిస్తాన్ గొంతులో పచ్చివెలక్కాయపడినట్లే అవుతుంది. అందుకే ఇమ్రాన్ ఖాన్ భయపడుతున్నాడు. తన భయాన్ని భారత్ లోని ముస్లింలకు ఎక్కించాలని చూస్తున్నాడు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఎన్ని చెప్పినా భారత ముస్లింలు నమ్మరుగాక నమ్మరు.

Related posts

శ్రీకాకుళం శ్రీ సంతోషి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

Satyam NEWS

భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రం యాగంటి

Satyam NEWS

జీహెచ్ఎంసీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఏర్పాట్లు పూర్తి

Sub Editor

Leave a Comment