పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితుల గోడు పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వారి మొరను ఆలకించడం లేదు. దాంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కొల్లాపూర్ మండలం కుడికిల్ల, తిరుణాంపల్లి గ్రామ రైతులు జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు, బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారిని కలిసి తమ బాధలు వివరించారు. టీఆర్ఎస్ నాయకులు తమతో ఓట్లు వేయించుకుని తమను మరచిపోయారని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ బాధలు తీసుకువెళ్లి తమను ఆదుకోవాలని వారు ఆచారిని కోరారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఏ విధంగా పరిహారం ఇచ్చారో… అదే విధంగా తమకు ఇవ్వాలని వారు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ టిఆర్ఎస్ నాయకులు తమకు ఏమాత్రం సహాయం చేయడం లేదని పైగా తమ ఉద్యమాన్ని అణచి వేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ మూడు నియోజకవర్గాల నాయకులు ఎప్పటికప్పుడు తమకు బూటకపు హామీలు ఇచ్చి సమస్యను వాయిదా వేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జి ఎల్లేని సుధాకర్ రావు తదితరులు కూడా పాల్గొన్నారు.