పల్నాడు జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మండల/మున్సిపల్ స్థాయి, గ్రామ స్థాయిల్లో పారిశుద్ధ్య కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుందన్నారు. స్థానిక కలెక్టరేట్ లోని డా.బీఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో పారిశుద్ధ్యం, ఆరోగ్యం, తాగునీటి సరఫరా, ఆధార్ కేంద్రాలపై జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ కోసం జిల్లా స్థాయి, మున్సిపల్ స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పారిశుద్ధ్యం, ఆరోగ్య నిర్వహణపై మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. వైద్యాధికారులను ఎప్పటికప్పుడు సంప్రదించి వారి పరిధిలో ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. ఫ్రైడే-డ్రై డే వారంలో శుక్ర, శని, ఆదివారాలు మూడు రోజుల పాటూ నిర్వహించాలన్నారు. స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి గ్రామాలు, పట్టణాలలో స్వచ్ఛత పెంపొందించాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 71 ఆధార్ కేంద్రాల్లో వీలైనంత ఎక్కువ మందికి ఎన్రోల్ మెంట్ సర్వీసులు అందించాలన్నారు.
వచ్చే నెల పింఛన్ల పంపిణీ తొలి రోజే వంద శాతం పంపిణీ చేసేందుకు ముందురోజే బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవడం, ఒక్కో ఉద్యోగికి 50-60 మంది పింఛన్ దారులను మాత్రమే మ్యాపింగ్ చేయడం, దూర ప్రాంతాల్లో ఉన్న లబ్దిదారులను ముందురోజు నాటికే సొంత ఊర్లకు వచ్చేలా చూడటం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వసంత రాయుడు, డీపీవో ఎం.వి.భాస్కర్ రెడ్డి, డీఎంహెచ్వో రవి, గ్రామ&వార్డు సచివాలయాల జిల్లా నోడల్ అధికారి వెంకట్ రెడ్డి , డీఆర్డీఎ పీడీ బాలు నాయక్ మరియు డీఎల్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు.