Slider సంపాదకీయం

డాక్టర్ సుధాకర్ ఈ సమాజాన్ని క్షమించు

#Dr. Sudhakar

కరోనా సమయంలో ఎన్ 95 మాస్కులు లేవు అన్నందుకు ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఇంతకాలం అంకిత భావంతో చేసిన ఉద్యోగం పోవడంతో అతను మద్యం తీసుకుని రోడ్డు పైకి వచ్చాడు. ఇప్పుడు అతడిని పిచ్చోడు అంటున్నారు పోలీసులు.

ఎంత దారుణం? అతను ఒక డాక్టర్. ఎందరికో చికిత్స అందించిన ఎనస్తటిస్టు. ఇప్పుడు పోలీసులు అతడి చేతులు కట్టేసి కుక్కను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన జరిగిన క్షణం నుంచి మనం మనుషులమేనా అని అనిపిస్తున్నది. మన చదువుకు, మన సంస్కారానికి విలువ ఉండదా అనిపిస్తున్నది.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఎనస్తటిస్టు డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ కథ ఇది. ఆయన చేసిన తప్పేంటి? మాస్కులు లేవని చెప్పడమా? ఆ తర్వాత మీడియా ఇంటర్వ్యూలలో డాక్టర్ సుధాకర్ వివరణ ఇచ్చారు.

తాను ప్రభుత్వాన్ని విమర్శించలేదని, మాస్కులు లేవని మీడియాకు చెప్పడం తప్పే అయితే తనను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమించాలని ప్రాధేయపడ్డారు. అయినా ప్రభుత్వం కనికరించలేదు. ఆయనను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోలేదు.

మాస్కులు లేవు అని చెప్పగానే అతడు తెలుగుదేశం పార్టీ వాడని వై ఎస్ జగన్ ప్రభుత్వం ముద్ర వేసేసింది. ఇప్పుడు పిచ్చివాడు అనే ముద్ర వేస్తున్నది. ఇలాంటి సంఘటనలతో మానవత్వం అనే మాటకు అర్ధం చచ్చిపోతుంది. లాక్ డౌన్ సమయంలో కూడా మద్యం షాపులు తెరిచిన ప్రభుత్వమే డాక్టర్ సుధాకర్ తాగి రోడ్డుపైకి వచ్చాడని, ఇది నేరమని అంటున్నది.

ప్రభుత్వం ఒక మెట్టుదిగితే ఒక డాక్టర్ నిలబడతాడు. సస్పెన్షన్ ఎత్తివేసి నెల రోజుల పాటు ఆయన ప్రవర్తనను గమనించండి. అతని ప్రవర్తన సరిగా ఉంటేనే ఉద్యోగంలోకి తీసుకోండి. అంతే కానీ డాక్టర్ సుధాకర్ ను పర్మినెంటుగా పిచ్చివాడ్ని చేయవద్దు దయచేసి. పిచ్చివాడిగా ముద్రవేసి సమాజానికి నష్టం చేయవద్దు. ఈ వరుస సంఘటనలకు బాధ్యులైన వారిని, వారు ఎవరైనా సరే… తప్పు దిద్దుకోకపోతే చరిత్ర క్షమించదు. ఒక డాక్టర్ కథను ఎవరు గుర్తుంచుకుంటారులే… కొద్ది రోజుల తర్వాత మర్చిపోతారు అనుకోవచ్చు. కానీ డాక్టర్ సుధాకర్ కు జరిగిన అన్యాయం మాత్రం అందరిని వెంటాడుతూనే ఉంటుంది….సరిదిద్దుకోకపోతే.

Related posts

ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదు

Satyam NEWS

నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కు పాదం

Satyam NEWS

సంపన్నుల కోసమే నూతన జాతీయ విద్యా విధానం

Murali Krishna

Leave a Comment