భారత ప్రభుత్వంపై తప్పుడు ప్రకటన చేసిన మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ నిషికాంత్ దూబే మంగళవారం మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారీ సమయంలో సరిగా స్పందించనందుకు భారత్ లో అప్పుడున్న ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిందని మార్క్ జుకర్‌బర్గ్ చేసిన తప్పుడు ప్రకటనపై తన ప్యానెల్ మెటా కు ఈ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ప్రజాస్వామ్య దేశం గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం దాని ప్రతిష్టను దిగజార్చుతుంది.
ఈ తప్పుకు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని దూబే అన్నారు. కోవిడ్ -19 ప్రబలినప్పుడు ప్రభుత్వ ప్రతిస్పందన సరిగాలేని కారణంగా భారతదేశంలో అప్పటి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిందన్న జుకర్‌బర్గ్ వ్యాఖ్యలను సోమవారం తోసిపుచ్చిన సమాచార మరియు ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ అతడిని ట్యాగ్ చేశారు. మెటా చీఫ్ ప్రకటన వాస్తవంగా సరికాదని వైష్ణవ్ అన్నారు. మంత్రి మాట్లాడుతూ, “ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, భారతదేశం 2024 ఎన్నికలను 640 మిలియన్లకు పైగా ఓటర్లతో నిర్వహించింది.
భారతదేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని NDAపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు అని తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్లకు ఉచిత ఆహారం, 2.2 బిలియన్ ఉచిత వ్యాక్సిన్‌లు మరియు సహాయం అందించడం లాంటి ఎన్నో పనులను నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతదేశం చేసిందని ఆయన గుర్తు చేశారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నడిపించడం వరకు ప్రధాని మోడీ ఎన్నో విజయాలు సాధించారని అందుకే నిర్ణయాత్మక మూడవసారి విజయం సాధించారని, ఇది ఆయన సుపరిపాలనకు నిదర్శనమని వైష్ణవ్ అన్నారు. జుకర్‌బర్గ్, పోడ్‌కాస్టర్ జో రోగన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారతదేశంతో సహా చాలా దేశాలలో కోవిడ్ మహమ్మారీ సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు 2024 ఎన్నికల్లో ఓడిపోయాయని పేర్కొన్నారు.